Andhra Pradesh: ఓట్ల లెక్కింపునకు వేళాయే.. తొలి ఫలితం అక్కడే!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది.
By Srikanth Gundamalla
Andhra Pradesh: ఓట్ల లెక్కింపునకు వేళాయే.. తొలి ఫలితం అక్కడే!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది. జూన్ 4వ తేదీన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఆలోచన అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఈ సారి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి. దాంతో.. తామే ఎక్కువ స్థానంలో గెలుస్తామనీ.. అధికారంలోకి వస్తామని దీమాగా చెబుతున్నారు. మరోవైపు అధికార పార్టీ వైసీపీ కూడా అదే దీమాతో ఉంది. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఓటు వేశారని తామే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు.
ఇక ఈ క్రమంలో లెక్కింపు ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తుంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంది. ఉదయం 11 గంటల వరకే ఎర్లీ ట్రెండ్స్ వెలువడగా.. మధ్యాహ్నం వరకు ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో త్వరగానే ఫలితం తేలిపోతుందని అంటున్నారు. కానీ.. ఎక్కువ ఓట్లు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం రాత్రి వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు. దాంతో.. ఈ నియోజకవర్గంలో ఫలితం త్వరగా వెలువడుతుంది..? ఎక్కడ ఆలస్యం అవుతుందనే దానిపైనా చర్చ జరుగుతోంది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. దీనికి అరగంటకు ఎక్కువ సమయం పడితే .. వీటిని ఒకవైపు లెక్కిస్తూనే మరోవైపు 8.30 గంటల నుంచే ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు. ఇది పూర్తయ్యాక వీవీ ప్యాట్‌లలోని స్లిపులను లెక్కించనున్నారు. రౌండ్ల వారీగా లెక్కింపు కొనసాగుతుంది. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్నికల సంఘం ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన రౌండ్లను నిర్దారించింది. రాష్ట్రంలోని 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లోపు లెక్కింపు పూర్తవుతుంది. ఈ ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వచ్చే అవకాశాలు న్నాయి. మరో 61 నియోజకవర్గాల్లో 1 నుంచి 24 రౌండ్ల లెక్కింపు జరగనుండగా.. వీటి ఫలితానలు సాయంత్రం 4 గంటల్లోపు వస్తాయని అన్నారు. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు మించి ఓట్ల లెక్కింపు జరగనుందని తెలుస్తోంది.
తక్కువ రౌండ్లు ఉన్న నియోజకవర్గ ఫలితాలు త్వరగా వస్తాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు-ఎస్సీ, ప.గో జిల్లాలోని నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తవనుందని తెలుస్తోంది. దాంతో.. మొదటగా ఇక్కడ ఫలితాలు వెల్లడించే చాన్స్ ఉంది. తొలి ఫలితం ఈ రెండు నియోజకవర్గాల్లోని ఒకదాని నుంచి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఎన్నికల అధికారులు. చంద్రగిరి, రంపచోడవరం-ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. వీటిల్లో ఒకటి చివరగా వెలువడే చాన్స్ ఉంది. ఈ ఫలితం కోసం రాత్రి వరకు వేచి చూడాల్సిందే.