సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

సీఎం జగన్‌కు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద ఈసీ నోటీసులు జారీ చేసింది.

By Srikanth Gundamalla
Published on : 7 April 2024 4:02 PM IST

andhra pradesh, election commission, notice,  cm jagan ,

 సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు 

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అగ్రనేతలు సైతం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పులను ఎత్తి చూపుతూనే అభ్యంతకర కామెంట్స్ చేస్తున్నారు. దాంతో.. రాజకీయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో.. ప్రజలను ఆకర్షించాలని ప్రచారంలో హామీలతో పాటు.. ప్రత్యర్థి పార్టీలపై ఘాటు కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల సీఎం జగన్‌ కూడా సిద్ధం సభ ద్వారా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కామెంట్స్‌ను వ్యతిరేకించిన టీడీపీ నేత వర్ల రామయ్య ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. తద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని సీఎం జగన్‌పై ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వర్ల రామయ్య ఫిర్యాదు మేరకు ఈసీ కూడా సీఎం జగన్‌కు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ చేసిన కామెంట్స్‌పై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. లేదంటే చర్యలు తీసుకుంటామని సీరియస్‌గా స్పందించి ఎన్నికల కమిషన్. దాంతో.. ఎన్నికల కమిషన్‌ సీఎం జగన్‌కు షాక్‌ ఇచ్చినట్లు అయ్యింది.

ఏప్రిల్ 3వ తేదీన వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పూతలపట్టు సిద్ధం సభలో పాల్గొన్నారు వైసీపీ చీఫ్, సీఎం జగన్. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు నేరాలు చేయడం అలవాటే అని వ్యాఖ్యానించారు. ప్రజలను మోసం చేయడం కూడా అలవాటే అన్నారు. అంతకుముందు మదనపల్లి సభలో కూడా చంద్రబాబుపై తీవ్రంగా కామెంట్స్ చేశారు. అరుంధతి సినిమాలో చంద్రబాబుని విలన్‌ పాత్ర అయిన పశుపతితో పోల్చుతూ కామెంట్స్ చేశారు. దాంతో.. సీఎం జగన్‌ కామెంట్స్‌పై టీడీపీ నేతలు సీరియస్‌గా స్పందించారు. వర్ల రామయ్య ఏకంగా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా సీఎం జగన్‌క నోటీసులు పంపారు.

Next Story