కౌంటింగ్ వేళ ఏపీలో అక్కడ హింస చెలరేగే చాన్స్.. నిఘా వర్గాల వార్నింగ్
ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 May 2024 3:18 PM ISTకౌంటింగ్ వేళ ఏపీలో అక్కడ హింస చెలరేగే చాన్స్.. నిఘా వర్గాల వార్నింగ్
ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత కూడా ఆ ఎఫెక్ట్ కొనసాగింది. కొద్ది రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఈ క్రమంలోనే హింసాత్మక సంఘటనకు బాధ్యులను చేస్తూ పలువురు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఇక రాష్ట్రంలో జూన్ 4న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఈ సందర్భంగా కూడా పలు చోట్ల ఘర్షణలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు నిఘా వర్గాలు చెప్పేశాయి.
కౌంటింగ్ సమయం దగ్గరపడుతుంటే ఎవరు గెలుస్తారనే టెన్షన్ రాజకీయ నేతల్లో ఉంటే.. ప్రజల్లో కూడా అదే ఆసక్తి కొనసాగుతోంది. మరోవైపు ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి గొడవలు జరుగుతాయో అనే ఆందోళన కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురం, కాకినాడ నగరంలో హింస చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు ఈసీకి తెలిపాయి. కౌంటింగ్‌కు ముందు, తర్వాత కూడా ఘర్షణలు చోటుచేసుకునే చాన్స్ ఉందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. నిఘా వర్గాల సూచనతో ఎన్నికల కమిషన్ మరింత అలర్ట్ అయ్యింది. కాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక గత 2019 ఎన్నికల సమయంలో.. 2024 ఎన్నికల పోలింగ్ సమయంలో కూడా ఇక్కడ గొడవలకు ప్రేరిపించిన వారిపై ఒక కన్నేసి ఉంచారు. మరోవైపు సీఆర్పీఎఫ్, ఏఆర్, సివిల్ పోలీసులతో పాటుగా ఇతర సిబ్బందిని కూడా బందోబస్తుగా ఏర్పాటు చేశారు.
పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థిగా వంగా గీత బరిలో ఉన్నారు. మరోవైపు కాకినాడ అసెంబ్లీ స్థానంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా కొండబాబు పోటీ చేశారు.