ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు తగ్గాయి: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 10:04 AM GMTఆంధ్రప్రదేశ్‌లో నేరాలు తగ్గాయి: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఇయర్ ఎండింగ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో 2023లో నమోదు అయిన నేర గణాంకాలను ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరింత సమర్దవంతంగా పనిచేసిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఫలితంగానే నేరాలు తగ్గాయని వెల్లడించారు.
ఏపీలో నేరాల శాతం క్రమంగా తగ్గుతూ వస్తోందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు తగ్గాయనీ.. అలాగే దొంగతనాల సంఖ్య తగ్గిపోయిందని వెల్లడించారు. బైకుల దొంగతనాలు కూడా తగ్గాయని అన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గ్యాంగులను పట్టుకున్నామనీ.. జిల్లా ఎస్పీ నుంచి కానిస్టేబుల్, హోంగార్డుల వరకూ అందరూ సమర్ధంగా పనిచేశారని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసులందరినీ డీజీపీ ప్రశంసించారు.
రోడ్డు ప్రమాదాలపై కూడా దృష్టి పెట్టామని డీజీపీ అన్నారు. బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలపై ప్రమాదాలు తగ్గేలా చేశామని చెప్పారు. 7.83 శాతం రోడ్డుప్రమాదాలు తగ్గాయని చెప్పారు. మహిలలపై తీవ్ర నేరాలను భారీగా తగ్గించామని చెప్పారు. మేజర్ కేసులను నేరుగా జిల్లా ఎస్పీలకు కేటాయించి త్వరితగతిన పరిష్కరించామని అన్నారు. రేప్, పోక్సో, డౌరీ డెత్, మహిళా హత్యలపై జరిగిన నేరాలకు జీవితఖైదు పడ్డ కేసులు 57 అయితే.. 20 ఏళ్లు శిక్ష పడ్డ కేసులు 49 ఉన్నాయని చెప్పారు. ఇక పదేళ్ల పాటు జైలు శిక్ష పడ్డవి 41 కేసులు, ఏడేళ్లపాటు జైలుశిక్ష పడ్డ కేసులు 15 ఉన్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కేసులు 15.2 శాతం తగ్గాయని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. లోక్ అదాలత్‌లో 4,01,748 పెట్టీ కేసులు పరిష్కారం చేశామన్నారు. సైబర్ నేరాలు కూడా రాష్ట్రంలో 25 శాతం మేర తగ్గాయన్నారు. సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు ద్వారా ఇది సాధ్యమైందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.
రౌడీషీటర్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామనీ.. మొత్తం 4వేల మందిలో వెయ్యి మంది జైల్లోనే ఉన్నారని డీజీపీ చెప్పారు. 200 మందిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేశామన్నారు. 10వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. గంజాయిపట సాగు చేసేవారికి ప్రత్యామ్నాయ పంటను సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో మావోయిస్టుల కదలికలు కూడా తగ్గాయని ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు.