జెండావందనం గ్రామగ్రామాన పండుగలా చేయాలి: డిప్యూటీ సీఎం పవన్
పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థను ఏపీలో కూటమి ప్రభుత్వం బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 4:55 PM ISTజెండావందనం గ్రామగ్రామాన పండుగలా చేయాలి: డిప్యూటీ సీఎం పవన్
పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థను ఏపీలో కూటమి ప్రభుత్వం బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు వారికి నిధుల కేటాయింపు పెంచుతున్నామన్నారు. గ్రామ సభల నిర్వహణ, జల్ జీవన్ మిషన్ నిధల వ్యయంపై పల్స్ సర్వే చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. అలాగే స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధులు పెంచామని పవన్ కల్యాన్ అన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గ్రామాల్లో ఏ పనులు చేయాలి? ఎలాంటి పనులకు ఆమోదం తెలపాలన్న విషయాల్ని గ్రామ సభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు పెరుగుతాయని తెలిపారు. ఈ గ్రామ సభలకు ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి అధికారులంతా ముందుకు రావాలని.. గ్రామస్తులతోనే కలిపి ఈ సభలు జరుగుతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తెచ్చిందనీ.. ఈ పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నా, వాటి ఫలాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించటం లేదని ఆరోపించారు. ఇక జెండా వందనం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని పవన్ కల్యాణ్ సూచించారు. 5 వేల జనాభా కంటే తక్కువగా పంచాయతీలకు రూ.100లు నుంచి రూ.10 వేలకు, 5 వేల జనాభా దాటిన పంచాయతీలకు రూ.250లు నుంచి రూ.25 వేలకు పెంచినట్లు వివరించారు. సర్పంచులు సగర్వంగా గ్రామంలోని అందరినీ పిలిచి మరీ జెండా పండుగను నిర్వహించుకునేలా కూటమి ప్రభుత్వం నిధులను ఇస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.