కేటాయించిన శాఖలు మనసుకు దగ్గరగా ఉన్నాయి: డిప్యూటీ సీఎం పవన్
డిప్యూటీ సీఎంతో పాటు.. పలు కీలక శాఖలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 12:51 PM GMTకేటాయించిన శాఖలు మనసుకు దగ్గరగా ఉన్నాయి: డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో పాటు.. పలు కీలక శాఖలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా తనకు ఆయా శాఖలను కేటాయించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు జనసేన మూల సిద్దాంతాలకు, తన మనసుకి దగ్గరగా ఉన్నాయని ఆయన చెప్పారు. కీలక శాఖలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకి తాను కృతజ్ఞతలు చెప్పారు. మంత్రిగా రాష్ట్ర ప్రజలకు అవసరమైన సేవను అందిస్తాననీ.. ఈ భాగ్యం తనకు దక్కినందుకు సంతోషంగా ఉన్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
ఇక తనకు కేటాయించిన శాఖలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి మరింత మెరుగైన సేవలను అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఉపాధి హామీ నిధుల సద్వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యక దృష్టి పెడతానన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. అటవీ సంపదను కాపాడి, పచ్చదనం పెంపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
మరోవైపు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు ప్రజాప్రయోజనల శాఖల బాధ్యతలను అప్పగించడం పట్ల పవన్ కల్యాణ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకావాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే సినీ రంగానికి రాష్ట్రంలో స్నేహ పూర్వక వాతావరణ నెలకొల్పేలా చూస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.