పిఠాపురంలో స్థలం కొన్న డిప్యూటీ సీఎం పవన్, ధరెంతంటే..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 July 2024 6:50 AM ISTపిఠాపురంలో స్థలం కొన్న డిప్యూటీ సీఎం పవన్, ధరెంతంటే..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల్లో గెలవడానికి ముందే ఆయన పిఠాపురంలోనే ఇక నుంచి ఉంటానని చెప్పారు. అక్కడే ఇల్లు కూడా కట్టుకుంటానని వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురంలో స్థలం కొనుగోలు చేశారు. సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. స్థానికంగా స్థలం కొని.. బుధవారం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. పిఠాపురం మండలం భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.8 ఎకరాలు మరో బిట్ స్థలాన్ని కొనుగోలు చేశారు.
పవన్ కల్యాణ్ కొనుగోలు చేసిన భూమి విలువ రూ.కోట్లలో ఉంటుందంటున్నారు. అంతేకాదు.. జనసేన నేతలు మరో పదెకరాల తోటలు కొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిలో.. రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారు.
బుధవారం పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ మేరకు మాట్లాడుతూ.. పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసినట్లు ప్రకటించారు.. తాను పిఠాపురంలో ఉండను.. హైదరాబాద్‌లో ఉంటానని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారని గుర్తు చేశారు. పిఠాపురంలో మూడున్నర ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. ఇల్లు, క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటున్నట్లు వెల్లడించారు పవన్ కల్యాణ్. నియోజకవర్గం ప్రజలు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకానేనని.. కానీ తనకు చెడ్డపేరు తీసుకురావొద్దని కోరారు పవన్ కళ్యాణ్. కొంతమంది వారి వాహనాల నంబర్ ప్లేట్‌లపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకున్నారని.. ఒకవేళ రవాణా శాఖ అధికారులు నంబర్ ప్లేట్లు చూసి అడిగినా.. వన్‌వేలో తప్పుగా వెళ్లి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనకూడదని చెప్పారు. ఎవరైనా సరే చట్టాలు, రూల్స్ పాటించాలని డిప్యూటీ సీఎం పవన్ కోరారు.