Andhra Pradesh: నేల కూలిన 150 ఏళ్ల నాటి సినీ వృక్షం
తూర్పు గోదావరి జిల్లాలో ఏళ్ల చరిత్ర ఉన్న ఒక సినిమా చెట్టు కుప్పకూలింది.
By Srikanth Gundamalla
Andhra Pradesh: నేల కూలిన 150 ఏళ్ల నాటి సినీ వృక్షం
ప్రకృతి అందాలకు కేరాఫ్ ఉభయగోదావరి జిల్లాలు. పచ్చని చెట్లు.. పంట పొలాలు.. నీళ్లు ఇలా చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది. అయితే.. తూర్పు గోదావరి జిల్లాలో ఏళ్ల చరిత్ర ఉన్న ఒక సినిమా చెట్టు కుప్పకూలింది. దాదాపు 300 కు పైగా సినిమా సన్నివేశాలను ఈ చెట్టు దగ్గరే చిత్రీకరించారు. అలాంటి చెట్టు ఇప్పుడు ఉన్నట్లుండి కుప్పకూలిపోవడంతో స్థానికంగా ఉన్న జనం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున ఒక చెట్టు ఉంది. ఈ చెట్టుకూ ఒక పేరు ఉంది. అదే సినీ వృక్షం. గత 150 ఏళ్ల నుంచి ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా నిలబడే ఉంది. కానీ.. ఇప్పుడు ఈ చెట్టు కుప్పకూలిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సహా అలనాటి ప్రముఖుల సినిమాలను ఎన్నో ఈ చెట్టు కింద చిత్రీకరించారు. తాజాగా ఈ చెట్టు రెండుగా చీలి నేలకూలింది 1975లో వచ్చిన పాడి పంటలతో వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు వంటి సినాఇమాల్లో ముఖ్యమైన సీన్స్‌ను ఇక్కడే చిత్రీకరించారు. ఈ సినీ చెట్టు సంరక్షణ విషయంలో పాలకులు, అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపించలేదు. ఏటా వరదలకు గట్టు కొద్దికొద్దిగా దిగబడి చివరికి చెట్టు మొదలు వచ్చింది. దాంతో.. చివరకు నేలలలో పట్టుకోల్పోయిన 150 ఏళ్ల చరిత్ర ఉన్న సినీ వృక్షం రెండుగా చీలి పడిపోయింది. అయితే గోదావరి ఒడ్డున ఉన్న నిద్రగన్నేరు చెట్టుకూలిపోయిన చోటే మరో చెట్టు నాటేందుకు రాజమహేంద్రవరం రైజింగ్ సంస్థ ముందుకొచ్చింది. దాని స్థానంలో 20అడుగుల వృక్షాన్ని నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.