ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు

ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

By Srikanth Gundamalla  Published on  31 May 2024 5:48 AM GMT
andhra Pradesh, case booked,  sajjala, ycp, tdp,

 ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు

ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లపై చేసిన వ్యాఖ్యలకు గాను సజ్జలపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. సజ్జలపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 153, 505 & 125 కింద కేసు నమోదు చేశారు. టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్‌ ఏజెంట్లుగా జూన్ 4న కౌంటింగ్‌ రోజున అవసరం లేదని సజ్జల కామెంట్స్ చేశారు. ఈ మేరకు స్పందించిన టీడీపీ పోలీసులకు కంప్లైంట్ చేసింది.

కాగా.. ఈ నెల 29న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్‌ ఏజెంట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులోనే ఏజెంట్లకు అవగాహన కల్పించారు. ఈ మేరకు మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. వైఎస్సార్‌సీపీ టార్గెట్‌ ఇది అని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన చెప్పారు. దానికి అవసరమైనవి తెలుసుకోవాలన్నారు. అవతలివారు అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏవేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలన్నారు. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలని చెప్పారు.. అంతే తప్ప రూల్‌ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదని సజ్జల ఆ సమావేశంలో వ్యాఖ్యానించారు.

ఇక సజ్జల కామెంట్స్‌పై స్పందించింది టీడీపీ. కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే ఉద్దేశంతో సజ్జల రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు మోడల్ కోడ్‌ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించడమే అని చెప్పారు. పలు వర్గాల మధ్య చీలిక, శత్రుత్వాన్ని సృష్టించే నేరపూరిత ఉద్దేశమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లింఘించేందుకు సిద్ధమైన కౌంటింగ్ ఏజెంట్లను ఎంపిక చేయాలని వారు ఎలక్షన్ ఏజెంట్లను ఆదేశించినందుకు సజ్జలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. ఈమేరకు ఎన్నికల ప్రదానాధికారి ఎంఎన్ హరేంధీర ప్రసాద్‌కు మెమోరాండం సమర్పించారు.

సజ్జల చేసినవి అభ్యంతరకర వ్యాఖ్యలు అని టీడీపీ పేర్కొంది. ఎన్నికల సమయంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయనీ.. వాటిని తేలిగ్గా తీసుకోవద్దని వారు సూచించారు. ముఖ్యంగా మార్జిన్లు తక్కువగా ఉంటాయని భావించిన పక్షంలో కౌంటింగ్‌ను విధ్వంసం చేయడానికి వైసీపీ తన విధాలుగా ప్రయత్నిస్తుందనే అనుమానాలు వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు. ఈ క్రమంలోనే కౌంటింగ్ ఏజెంట్లు కూర్చొనే స్థానాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై ఆర్‌వోలు ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు. సజ్జలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కూడా టీడీపీ నాయకులు కోరారు.

Next Story