ఈ నెల 31 ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు చాన్స్!
ఈ నెల 31న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది.
By Srikanth Gundamalla
ఈ నెల 31 ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు చాన్స్!
ఈ నెల 31న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పథకాలకు ఈ కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దాంతో.. 31న జరగనున్న మంత్రి వర్గ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీలో ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ అయితే రాలేదు కానీ..రాజకీయ పార్టీలు అప్పుడే శంఖారావం పూరించాయి. ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రచారాలు చేస్తుంటే.. ఇటీవలే సిద్ధం పేరుతో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 31న జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే మంత్రివర్గ సమావేశంలో వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్‌పై చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త పథకాలు, జగనన్న కాలనీలకు సంబంధించిన అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.దాంతో.. నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 31న జరగబోయే కేబినెట్ భేటీలో మంత్రులు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇంకా ఎన్నికలకు దాదాపు 70 రోజులే ఉన్నాయన్న సీఎం జగన్.. మరి ఇప్పుడే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారా? లేదా? ఎన్నికల తర్వాతే పరీక్షలు ఉంటాయా? అనే గందరగోళం నిరుద్యోగుల్లో ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పిఆర్సీకి రిపోర్ట్ వచ్చే లోపు ఐఆర్ పై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
మరోవైపు రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారికి భారంగా పడిన పంట రుణాలను మాఫీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 31న జరిగే కేబినెట్ సమావేశంలో రుణమాఫీ విధివిధానాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు. రుణమాఫీ విషయంలో నిర్ణయం తీసుకుంటే రైతులంతా వైసీపీకే పడే అవకాశాలు ఉంటాయనీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ ప్రభుత్వం కూడా ఈ తరహాలోనే ఆలోచన చేస్తుందని తెలుస్తోంది. ఇక ఏపీలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ తరహా పథకాన్ని కూడా ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోంది. దీనిపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.