ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ భేటి ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌ సమావేశ మందిరంలో మంగళవారం కొనసాగిన కేబినెట్‌ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌రిధిలో సంపూర్ణ నిర్మాణాల‌పై చ‌ర్చ జ‌రిగింది. రాజ‌ధాని ప‌రిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఎకు రూ.3వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినేట్ అంగీకారం తెలిపింది.

నవరత్నాలు పథకాలపై ఈ ఏడాది క్యాలెండర్‌కు ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించింది. కేబినెట్‌ ఆమోదంతో 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాల క్యాలెండర్ అమల్లోకి రానుంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎంపిటిసి, జెడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికలపై చర్చ జరిగింది. అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రులకు సీఎం జగన్ తెలిపారు. ముందు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహణ చేపట్టాలని కోరతామని వ్యాఖ్యానించిన సీఎం.. కోవిడ్ వాక్సినేషన్ త్వరగా ఇవ్వకపోతే మళ్ళీ కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలపై మంత్రుల‌ను అభినందించారు.

అదేవిధంగా 'ఈబీసీ నేస్తం' పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45వేల ఆర్ధిక సాయం అందనుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ఈ పథకం వర్తించనుంది. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే.. రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. క‌డ‌ప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కుల‌కు భూ కేటాయింపుల‌పై చ‌ర్చ జ‌రిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జ‌రుగుతున్న నేప‌థ్యంలో దీనిపై కూడా చ‌ర్చించారు. ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో తీర్మానం చేయాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది.


తోట‌ వంశీ కుమార్‌

Next Story