ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. బియ్యం బస్తాలపై రైతుల వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల గౌరవాన్ని పెంపొందించేలా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి బియ్యం బస్తాపై క్యూఆర్...
By - అంజి |
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. బియ్యం బస్తాలపై రైతుల వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల గౌరవాన్ని పెంపొందించేలా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి బియ్యం బస్తాపై క్యూఆర్ (QR) కోడ్‌లను ముద్రించడం ద్వారా, ఆ పంటను ఎవరు పండించారు, ఎక్కడ పండించారు అనే వివరాలను వినియోగదారులు తెలుసుకునే వెసులుబాటు కల్పించామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నెల్లూరు కలెక్టరేట్‌లో వరి కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. దేశంలోనే ఇటువంటి నమూనాను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఇది ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పండించిన బియ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 41,000 పాఠశాలలు, 400 పైగా సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేయనున్నారు. ఈ బియ్యం బస్తాలపై ఉండే క్యూఆర్ కోడ్‌ల ద్వారా, విద్యార్థులు తాము తినే ఆహారాన్ని పండించిన రైతుల వివరాలను స్వయంగా గుర్తించవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్క నెల్లూరు జిల్లాలోనే 75,000 టన్నుల వరిని సేకరించామని, ఈ సీజన్‌లో రెండు లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి మిల్లు యజమానులను కోరారు. ధాన్యం రవాణాకు వాహనాల కొరత మరియు గన్నీ బ్యాగుల కొరత వంటి అంశాలపై అధికారులతో చర్చించి, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అంతకుముందు కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి, నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.