ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక నో పేపర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 8:19 AM ISTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అసెంబ్లీ సమావేశాలను పేపర్ లెస్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే.. రాష్ట్ర బడ్జెట్.. ఆ తర్వాత సభ్యుల ప్రశ్నలు, సమాధానాలు.. ఎజెండా, కమిటీల రిపోర్టు ఇలా ఒక్కటేమిటీ అన్నీ కాగితాల రూపంలోనే ఉన్నాయి. కాగితాలను పూర్తిగా తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగిత రహితంగా డిజిటల్ రూపంలోకి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అడుగులు వేస్తున్నారు. దీని కోసం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే నెవాలో రాష్ట్ర అసెంబ్లీ భాగస్వామ్యం అవ్వబోతుంది. దీనికి సంబంధించి త్వరలోనే అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోనున్నారు.
కాగిత రహిత అసెంబ్లీ సమావేశాలు పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి. గుజరాత్, అస్సాం, మణిపూర్, ఒడిశా, పంజాబ్, తమిళనాడులో డిజిటల్ వ్యవహారాలే కొనసాగుతున్నాయి. ఇటీవలే ఒడిశాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను డిజిటల్ విధానంలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోనూ నెవాను అమల్లోకి తీసుకురావడంపై అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఏపీ ఐటీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య ఎంఓయూ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 21 కోట్ల అంచనా వ్యయం అవుతుంది. ‘నెవా’ కింద కేంద్రం అందులో 60 శాతం కేటాయిస్తుందని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుందని వివరించారు.
అసెంబ్లీలో సభ్యులు ప్రసంగించాల్సిన ప్రతి మాటా డిజిటలైజ్ చేస్తారు. అవన్నీ నెవాలో ఉంటుంది. సభ్యులు ఎంత సభలో ఉన్నారనే విషయంతో పాటు.. ఎంత సమయం మాట్లాడారు అనే విషయాలన్నీ నమోదు అవుతాయి. కాగా.. ప్రస్తుతం సభలో ప్రత్యేకంగా అసెంబ్లీ రిపోర్టర్లు కూర్చొని సభ్యుల ప్రసంగాలను నోట్ చేసుకొని, తర్వాత వాటిని రాసి నివేదికల రూపంలో భద్రపరుస్తున్నారు.