Andhra Pradesh: ఒక్క ఫోన్ కాల్..వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు విధానం మార్పులకు శ్రీకారం చుట్టింది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 7:54 AM ISTAndhra Pradesh: ఒక్క ఫోన్ కాల్..వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు
చాలా మంది విద్యుత్ కనెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారికి చిక్కులు ఎదురవుతుంటాయి. డబ్బులు ఇస్తే కానీ పనిజరగదంటూ తిప్పుకుంటారు అధికారులు. విద్యుత్ శాఖలో గత రెండేళ్లలో పట్టుబడ్డ ఏసీబీ కేసుల్లో సగం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం డబ్బులు డిమాండ్ చేసి దొరికినవే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే విద్యుత్ పంపిణీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కనెక్షన్ల మంజూరు విధానం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై సచివాలయం, మీసేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. 1912 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేస్తే విద్యుత్ కనెక్షన్ కోసం రిజిస్ట్రేషన్ చేసే పద్ధతిని తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రాధాన్య క్రమంలో ఆ రైతులకు విద్యుత్ కనెక్షన్లను అందించనున్నారు అధికారులు. ఈపీడీసీఎల్ పరిధిలో తొలిసారి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని కోసం రెవెన్యూ శాఖ నుంచి 11 జిల్లాల్లోని వెబ్ ల్ఆయండ్ వివరాలను ఈపీడీసీఎల్ పోర్టల్‌కు అనుసంధానం చేశారు.
కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇలా తీసుకోండి..
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం 1912కి కాల్ చేయాలి. రైతు తన భూమి ఖాతా సంఖ్య, సర్వే నెంబర్ చెప్పిన వెంటనే వెబ్ ల్యాండ్‌లో ఆయా వివరాలను సరిచూసి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. దీని కోసం 1912 కాల్ సెంటర్‌లో కొంతమంది ప్రత్యేకంగా పనిచేస్తుంటారు. గత నెల రోజుల్లోనే అయిదు ఉమ్మడి జిల్లాలకు చెందిన వెయ్యి 304 మంది రైతులు కొత్త విధానంలోనే వ్యవసాయ కనెక్షన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో పాదర్శకత కోసమే ఈ విధానం తీసుకొచ్చింది విద్యుత్‌శాఖ. ఇక మీసేవ కేంద్రాలు, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని విద్యుత్ శాఖ నిలిపివేసింది. అయితే.. ఒక వేళ రైతులు కాల్ చేసినప్పుడు బిజీ వచ్చినా.. రిటర్న్ ఫోన్ చేసి మరీ వివరాలు తీసుకుంటారని చెప్పారు అధికారులు.