సూపర్ సిక్స్ హామీల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) విధానాలని స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు
By అంజి Published on 21 Nov 2024 6:39 AM ISTసూపర్ సిక్స్ హామీల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) విధానాలని స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తుందని బుధవారం అసెంబ్లీలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నదని తెలిపారు. సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం మొదటి నుంచి పెద్దపీట వేసిందన్నారు. ప్రతి ఒక్కరికీ కడుపు నింపుకోవడానికి తిండి, బట్టలు, కావాల్సిన గూడు ఉండాలన్నదే ఎన్టీఆర్ రామారావు నినాదమని తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్నదని, పేదలను అప్పట్లో గుడిసెల నుంచి పక్కా ఇళ్లకు మార్చాలనే లక్ష్యంతో ఇళ్లు నిర్మించి ఇచ్చారని నాయుడు గుర్తు చేశారు.
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 162 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అసెంబ్లీలో నాయుడు ప్రసంగించారు. ఎన్నికలు, ప్రజల తీర్పులు కొత్తేమీ కానప్పటికీ, ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు ప్రదర్శించిన చైతన్యం నిజంగా ఒక విప్లవమని ఆయన అభివర్ణించారు. టీడీపీ సారథ్యంలోని ఎన్డీయే కచ్చితంగా తమకు అండగా నిలుస్తుందని, వారి అంచనాలకు తగ్గట్టుగానే నడుస్తామన్న విశ్వాసంతో ప్రజలు ఈ తీర్పును ఇచ్చారని, ఇప్పుడు వారి అంచనాలకు తగ్గట్టుగా నడవడం మన కర్తవ్యమని ముఖ్యమంత్రి సభలో చెప్పారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 1978 నుంచి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. ఎన్నో అవాంతరాలను దాటుకుని కొన్ని పదవులు కూడా అనుభవించానని చంద్రబాబు నాయుడు అన్నారు. ''నాపై 24 క్లైమోర్ మైన్‌లతో దాడి జరిగిన తర్వాత వేంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మ ప్రసాదించాడు. ఈ సభలోనే నాకు, నా కుటుంబానికి అవమానం జరిగినప్పుడు చాలా బాధపడ్డాను'' అని తెలిపారు.
అధికారం, ముఖ్యమంత్రి కుర్చీ తనకు కొత్త కాదని, టీడీపీ కార్యకర్తల కంటే ప్రజలే తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని నాయుడు అన్నారు. ''నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టగలనన్న నమ్మకం ఉందా అని ప్రజలు నన్ను ప్రశ్నించగా, నేను ఎప్పుడూ ఆందోళన చెందకుండా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని నా సమాధానం'' అని ఆయన అన్నారు. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని, ప్రభుత్వం ఒక్కొక్క ఇటుకతో రాష్ట్రాన్ని నిర్మిస్తోందని ఉద్ఘాటించారు.
త్వరలో 150కి పైగా సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులు వాట్సాప్‌లో మెసేజ్ పెడితే వారి నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. దీపం-2 పథకానికి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉన్నవారు అర్హులని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 42.40 లక్షల మంది వినియోగదారులు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నారని, సిలిండర్ బుక్ చేసిన 48 గంటల్లో వినియోగదారుల ఖాతాలకు డబ్బు జమ అవుతుందని ఆయన చెప్పారు.
గత ప్రభుత్వం కేంద్ర నిధులను కూడా దారి మళ్లించిందన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన మంచినీటిని సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి సభకు హామీ ఇచ్చారు. ఎన్‌డిఎ ప్రభుత్వం మొదట ఉద్యోగాల విధానంతో ముందుకు సాగుతోంది. ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. మరిన్ని ఉద్యోగాల కల్పనకు ముందుకు వచ్చే వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందజేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
తన ప్రసంగంలో, చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మహిళల భద్రతపై కూడా మాట్లాడుతూ, లా అండ్ ఆర్డర్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు మరియు ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ పంపారు.
ఈ ఏడాది జూన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ 135 సీట్లతో ఆయన పార్టీ టీడీపీ విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు మూడోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.