కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో, దానిని నివారించేందుకు ఎన్నో ఫార్మా కంపెనీలు నెలల తరబడి కష్టపడి టీకాలు తయారు చేశాయి. అదే సమయంలో నెల్లూరుకు చెందిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య కరోనా నివారణకు చెట్ల మందును తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఆనందయ్య మీడియాతో మాట్లాడుతూ.. మంకీపాక్స్‌కు కూడా మందు తయారు చేయనున్నట్లు తెలిపాడు. విశాఖలో ఏర్పాటు చేసిన బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఆయుర్వేద వైద్యంలో ప్రతి వ్యాధికి మందు ఉంటుందని ఆనందయ్య చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్ రోగి కూడా తన వద్దకు రాలేదని, ఒక వేళ వస్తే.. ఆ వ్యాధి లక్షణాలను బట్టి మందు తయారు చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంకీపాక్స్ వైరస్‌ను నివారించే శక్తి ప్రకృతి వైద్యానికి ఉందన్నారు. మంకీపాక్స్ పట్ల ప్రజలు భయపడకుండా ఉండాలని చెప్పారు. ఎవరికైనా వ్యాధి సోకినట్లయితే తన దగ్గరకు వచ్చి చికిత్స చేయించుకోవాలని సూచించారు.