ఆనందయ్య కరోనా మందు గురించి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరో వైపు ఆనందయ్య మందు గురించి విపరీతమైన వదంతులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని రోజుల కిందట ఆనందయ్య మందును బ్లాక్ లో అమ్మగా.. ఇప్పుడు ఏకంగా నకిలీ మందులనే అమ్మేస్తూ ఉన్నారు. ఇది ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారే అవకాశం ఉంది.
ఆనందయ్య శుక్రవారం నుంచి మందు పంపిణీ ప్రారంభిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొందరు నమ్మి ఆనందయ్య గతంలో మందు పంపిణీ చేసిన ప్రాంతానికి కూడా వెళ్తున్నారు. ఈ ఘటనలపై ఆనందయ్య స్పందించారు. ప్రస్తుతం ఆయుర్వేద మందును పంపిణీ చేయడం లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా వదంతులను నమ్మకండని కోరారు. ప్రభుత్వం ప్రస్తుతం మందు పంపిణీని నిలిపేసిందని.. అలాగే తన దగ్గర మూలికలు కూడా స్టాక్ లేవని చెప్పారు ఆనందయ్య. ప్రభుత్వం అనుమతిచ్చిన తర్వాత.. మూలికలు అందుబాటులోకి వస్తే పంపిణీని ప్రారంభిస్తానని.. అప్పటివరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేశారు.
ఆనందయ్య మందుపై ప్రస్తుతం అధ్యయనం కొనసాగుతోంది. ఈ మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తయ్యింది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు రెస్ట్రోపెక్టివ్ స్టడీని ఆయుర్వేద వైద్యులు చేసిన నివేదిక అందజేశారు. మందు తీసుకున్న 570 మందిని ఫోన్లో సంప్రదించిన వైద్యులు.. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. మలిదశ ప్రయోగాలకు అవసరమైన అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. ఆనందయ్య మందు విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వంను హైకోర్టు సూచించింది.