అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు.. 300 మీటర్ల దూరంలో శిథిలాలు.. ముక్కలైన శరీరాలు
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన పేలుడు భయానకంగా ఉంది.
By అంజి
అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు.. 300 మీటర్ల దూరంలో శిథిలాలు.. ముక్కలైన శరీరాలు
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన పేలుడు భయానకంగా ఉంది. పలువురి శరీరాలు ముక్కలయ్యాయి. గోడలు, సిమెంట్ దిమ్మెలు ముక్కలై ఏకంగా మీటర్ల దూరంలో పడ్డాయి. భూమిపై అడుగుల మేర గుంతలు ఏర్పడ్డాయి. ఈ ఫ్యాక్టరీపైనే ఉన్న విద్యుత్ తీగలకు మంటలు అంటుకుని ఉంటే మరింత విధ్వంసం జరిగేది. తారాజువ్వల్లోకి మందు ఎక్కిస్తుండగా అగ్గిరవ్వలు పుట్టి ఎండ వల్ల తీవ్రత పెరిగినట్టు అంచనా.
పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు వెల్లడించారు. కాగా ఏపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల సాయం ప్రకటించింది. ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ పరిశిలీంచారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. పేలుడు కారణంగా 8 మంది మృతి చెందారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
పేలుడు నుండి బయటపడిన కైలాసపట్నంకు చెందిన గాయపడిన కార్మికుడు కె. శ్రీను ఈ భయానక సంఘటనను ఇలా వివరించాడు: "నేను ఉదయం 9 గంటల ప్రాంతంలో పనికి వచ్చాను. మధ్యాహ్నం సమయంలో మేము పని చేస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. నేను భవనంపై నుండి దూకాను. మంటలు ఎలా మొదలయ్యాయో మాకు తెలియదు" అని చెప్పాడు. గాయపడిన మరో బాధితుడు జె. నాగరాజు కుటుంబ సభ్యుడు ఎం. అప్పారావు మాట్లాడుతూ, కార్మికులు సామాగ్రిని వేరు చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని అన్నారు.