పోలవరం నిర్మాణంలో రాబోయే 4 నెలలు కీలకం: మంత్రి అంబటి
పోలవరం నిర్మాణానికి రానున్న నాలుగైదు నెలలు చాలా కీలకమని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
By అంజి Published on 5 March 2023 7:25 AM GMTపోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు
పోలవరం నిర్మాణానికి రానున్న నాలుగైదు నెలలు చాలా కీలకమని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అంబటి రాంబాబు ఆదివారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వేల ఏళ్ల పాటు ప్రజలకు నీటి సౌకర్యం కల్పించే ప్రాజెక్టు ఇది అని, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అభిప్రాయపడ్డారు. ఈ సీజన్‌లో ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామన్నారు.
డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని మరోసారి ప్రస్తావించిన మంత్రి.. ఆ ప్రాంతాన్ని బాగు చేసేందుకు పనులు చేస్తున్నామని తెలిపారు. ఆ ప్రాంతంలో కష్టపడి రిపేర్ చేయాల్సి వస్తోందన్నారు. పోలవరంపై తాను రాజకీయ ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. వరదల వల్ల డయాఫ్రమ్ వాల్‌కు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. గత ప్రభుత్వ తొందరపాటు వల్లే ఇంతటి అనర్థం జరిగిందన్నారు. గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమన్నారు.
డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం మానవ తప్పిదమని, ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను ఎలా బాగు చేయాలనే దానిపై అధికారులు చర్యలు తీసుకుని పరిశీలిస్తున్నారని మంత్రి అంబటి తెలిపారు. పనులు పూర్తి చేసేందుకు వచ్చే నాలుగైదు నెలలు చాలా కీలకమని, ఈ సీజన్‌లో ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం వైఎస్సార్ కలలు కన్న ప్రాజెక్ట్ అని, సీఎం జగన్ చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందని మంత్రి అంబటి ధీమా వ్యక్తం చేశారు.