ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన 'పుష్ప' చిత్రం నేడు విడుదలైంది. తెలంగాణ ప్రభుత్వం ఐదు షోలకు అనుమతి ఇవ్వగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బెనిఫిట్ షోకు అనుమతి లేదు. అయితే.. అనంతపురం జిల్లా హిందూపురంలోని ఎస్వీ థియేటర్ యాజమాన్యం శుక్రవారం తెల్లవారుజామున బెనిఫిట్ షోలు వేస్తామని టికెట్లు విక్రయించింది. దీంతో టికెట్లు కొనుకున్న వాళ్లంతా ఉదయాన్నే థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఎంతసేపటికి సినిమాను ప్రదర్శించకపోవడంతో అభిమానులు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
వెంటనే షోని ప్రారంభించాలని థియేటర్‌లో నినాదాలు చేశారు. అయితే.. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని.. బెనిఫిట్ షో రద్దు చేస్తున్నామని థియేటర్ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.500 థియేటర్ నిర్వాహకులు వసూలు చేశారని ఆరోపించారు. థియేటర్‌పై రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అభిమానులను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించి వేశారు. థియేటర్ గేట్లు మూసివేశారు. కాగా ఏపీలో బెనిఫిట్ షో లు వేయవద్దని ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 35ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. 'పుష్ప' సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. బన్ని వన్ మ్యాన్ షో అని అంటున్నారు.