తిరుమల శ్రీవారి స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను రేపటి నుంచి జారీ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీపై అధికారులతో టీటీడీ ఈవో సమీక్ష చేశారు. ఈ విధానం లేకుండా దర్శనాలు ఎలా జరిగాయి? రద్దు చేస్తే కలిగే పరిణామాలు, క్యూ లైన్లు, భద్రత వంటి అంశాలపై చర్చించారు. రేపటి నుంచి ఏ రోజుకారోజు టోకెన్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసంలో జారీ చేయాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు.
కాగా ఇవాళ స్వామి వారి దర్శనం కోసం భక్తులకు టోకెన్లు ఇవ్వకుండా, నేరుగా క్యూలైన్లలోకి అనుమతి ఇస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే రద్దీ తగ్గేవరకు సర్వదర్శనం భక్తులను నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోకి పంపిస్తున్నారు. రేపటి నుంచి సర్వ దర్శనం టోకెన్ల పంపిణీ ప్రారంభం కానుందని టీటీడీ తెలిపింది. కాగా ఇటీవల తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు పరిశీలించి పలు సూచనలు చేశారు.