అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం

Akbar Basha family suicide attempt.దువ్వూరు మండలం ఎర్రబల్లిలో అక్బర్ బాషా భూవివాదం మరో టర్న్ తీసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sep 2021 3:37 AM GMT
అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం

దువ్వూరు మండలం ఎర్రబల్లిలో అక్బర్ బాషా భూవివాదం మరో టర్న్ తీసుకుంది. సీఎం కార్యాల‌యం హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ త‌మ‌కు న్యాయం జ‌రిగేలా లేద‌ని ఆందోళ‌న‌కు గురైన అక్బ‌ర్ బాషా కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఇద్దరు పిల్లలతో సహా అక్బర్ బాషా దంపతులు సోమ‌వారం రాత్రి 10గంట‌ల స‌మ‌యంలో పురుగుల మందు తాగారు. గ‌మ‌నించిన స్థానికులు వారిని చాగ‌ల‌మ‌ర్రిలోని కేర‌ళ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని చెబుతున్నారు.

కర్నూలు జిల్లా చాగలమర్రిలో బాషా త‌న కుటుంబంతో నివ‌సిస్తున్నారు. కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలోని పొలం తగాదా విషయంలో తమకు న్యాయం జరగడం లేదని గత కొద్దిరోజులుగా వారు పోరాడుతున్నారు. ఈ విష‌యంలో అనాయ్యం జ‌రుగుతోంద‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తే.. ఎన్‌కౌంట‌ర్ చేస్తామ‌ని బెదిరిస్తున్నారంటూ ఈ నెల 11న పోస్ట్ చేస్ చేసిన సెల్పీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. విష‌యం తెలిసిన వెంట‌నే సీఎం కార్యాల‌య అధికారులు స్పందించి న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని హామీ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికి త‌మ‌కు న్యాయం జ‌రిగ‌లేదంటూ.. సోమ‌వారం రాత్రి కుటుంబం అంతా పురుగుల మందు తాగింది. ప్రస్తుతం వారు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

కడప ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. అక్బర్‌బాషా కుటుంబానికి ప్రాణాపాయం లేదన్నారు. ఎకరన్నర భూమి అక్బర్‌బాషా అత్త ఖాసింబీదిగా మైదుకూరు కోర్టు 2018లోనే తీర్పు ఇచ్చిందిన్నారు. మైదుకూరు కోర్టు తీర్పుపై ఎవరూ పై కోర్టుకు వెళ్లేదన్నారు. దీనిపై అభ్యంతరాలుంటే రెవెన్యూ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించారు.

Next Story