హ్యాట్రిక్ సాధించడమే లక్ష్యం: ఆ లిస్టులో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి, కాంగ్రెస్ మధ్య ఆసక్తికర పోరు నెలకొంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 April 2024 7:30 AM GMT
hat trick, ys avinash reddy, nandamuri balakrishna, election,

హ్యాట్రిక్ సాధించడమే లక్ష్యం: ఆ లిస్టులో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ 

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి, కాంగ్రెస్ మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడిపోతారో అంచనా వేయడం కూడా కష్టమే. ఎన్నికలకు ముందు కొంత మంది నాయకులు పార్టీలు మారారు. కొన్ని పార్టీలు వారికే సీటు ఇవ్వగా.. మిగిలిన నాయకులు ఆయా పార్టీలను గెలిపించుకుంటామంటూ శపథాలు చేశారు. రాష్ట్రంలో గట్టి పోటీ మధ్య హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా కొందరు నాయకులు బరిలోకి దిగారు. ఈ లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల గురించి మనం తెలుసుకుందాం.

1. కింజరాపు రామ్మోహన్ నాయుడు

టీడీపీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు 2024 లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి గెలవడంపై దృష్టి పెట్టారు. ఆయన శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 2024 ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ పేరాడ తిలక్‌ ను బరిలోకి దింపింది. 16వ లోక్‌సభకు రెండవ అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యునిగా పేరుగాంచిన కింజరుపు 2012లో తన తండ్రి కింజరాపు యర్రం నాయుడు మరణం తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు.

విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్ వైపు కేంద్రం దృష్టిని ఆకర్షించేందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. యునైటెడ్ స్టేట్స్‌లోని పర్డ్యూ యూనివర్శిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పొందారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నలు వేసే MP అభ్యర్థిగా ఉన్నారు. ఇక అనేక చర్చలలో పాల్గొన్నాడు.

2. కడప ఎంపీ అవినాష్ రెడ్డి

కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు వైఎస్సార్‌సీపీ ఎంపీగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బంధువు అవినాష్‌రెడ్డి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన కుటుంబ సభ్యురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయనున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి ఈసారి కఠినమైన ఎన్నికలని అంటున్నారు. కేసు ఇంకా పెండింగ్‌లో ఉండగానే వివేకాకు న్యాయం చేయాలని వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డిలు పోరాడుతున్నారు. అవినాష్ కు జగన్ ఎందుకు మద్దతిస్తున్నారనే ఆరోపణలను చాలా సందర్భాల్లో వారు లేవనెత్తారు.

3. ఎంపీ కేశినేని నాని

విజయవాడలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కేశినేని నాని తన సోదరుడు కేశినేని చిన్నిపై టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ తరపున కేశినేని నాని విజయవాడ నుంచి ఎంపీగా గెలిచారు. జనవరిలో.. నాని వైఎస్సార్సీపీ వైపు మారారు. విజయవాడ నుండి పోటీ చేయడానికి అతని సోదరుడు చిన్నికి టీడీపీ అవకాశం ఇచ్చింది. వ్యాపారంలో ఉన్న ఇద్దరు సోదరుల మధ్య వివాదం కాస్తా పెద్దదైందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధానిగా పరిగణించబడే విజయవాడలో ఈ ఇద్దరి మధ్య పోటీ కాస్తా రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.

4. వాసుపల్లి గణేష్ కుమార్

వైఎస్సార్సీపీ విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్.. జనసేన అభ్యర్థి సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పై పోటీ చేస్తున్నారు. విశాఖపట్నంలోని నాలుగు ప్రధాన అసెంబ్లీ నియోజకవర్గాలలో విశాఖపట్నం దక్షిణం ఒకటి. ఇటీవల జరిగిన సమావేశంలో వాసుపల్లితో పాటు మిగిలిన మూడు నియోజకవర్గాల అభ్యర్థులు నాలుగు నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకోవాలని జగన్ కోరారు. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన నేత వాసుపల్లికి ఆ సామాజికవర్గం నుంచి మంచి ఓటు బ్యాంకు ఉంది.

5. ఆర్కే రోజా

నగరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీకి చెందిన గాలి భాను ప్రకాష్‌ మీద ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రోజా భావిస్తూ ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో రోజా గెలవడం కష్టమేనని అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీడీపీలో ఉన్న సమయంలో రోజా ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోకి మారారు. జగన్ YSRCPని ప్రారంభించినప్పుడు, ఆమె జగన్ వెంట నడిచారు. 2014, 2019 సంవత్సరాలలో నగరి నుండి విజయాన్ని సాధించింది.

2019లో రోజా చేతిలో ఓడిపోయిన టీడీపీ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు భాను ప్రకాష్ ఇప్పుడు రోజాకు గట్టి పోటీ ఇస్తూ ఉన్నారు. ప్రచారంలో కూడా దూకుడు కనబరుస్తూ ఉన్నారు.

6. నందమూరి బాలకృష్ణ

టాలీవుడ్ లో టాప్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన వరుసగా మూడోసారి ఎమ్మెల్యే కావాలని భావిస్తూ ఉన్నారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. బాలకృష్ణ కూడా హ్యాట్రిక్ లక్ష్యంగా గత కొన్ని నెలలుగా తన సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు తనయుడుగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు.

అనంతపురం జిల్లాలోని హిందూపురం 1983 నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. ఒకప్పుడు తన తండ్రి, ఆ తర్వాత అన్నయ్య నందమూరి హరికృష్ణ ప్రాతినిధ్యం వహించారు. బాలకృష్ణ ప్రతి ఎన్నికల్లోనూ రామారావు, చంద్రబాబు నాయుడు కోసం ప్రచారం చేసారు కానీ.. 2014 వరకు ఎన్నికల యుద్ధంలోకి రాలేదు. కుటుంబంలో రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తుల్లో ఆయన మూడవ వ్యక్తి.

ఈ ఎన్నికలలో, YSRCP హిందూపూర్‌లో TN దీపికను పోటీకి దింపింది. కుల నేపథ్యాలపై దృష్టి సారించి, ఈ వర్గాల నుండి మద్దతును బలోపేతం చేయడం ద్వారా ఎన్నికల్లో పార్టీ అవకాశాలను పెంచాలని భావిస్తూ ఉంది. బీసీ వర్గానికి చెందిన దీపిక వైఎస్సార్‌సీపీ నేత వేణుగోపాల్‌రెడ్డి భార్య. బాలకృష్ణకు హ్యాట్రిక్‌ విజయం దక్కకుండా చేయడానికి వైఎస్సార్‌సీపీ పార్టీ సీనియర్‌ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియోజకవర్గ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించింది.

7. ముత్తంశెట్టి శ్రీనివాసరావు

టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావుపై భీమునిపట్నం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్‌ (ముత్తంశెట్టి శ్రీనివాసులు) పోటీ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, వారి రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో, ఇద్దరు నాయకులు ఎన్నడూ ఎన్నికల్లో ఓడిపోలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి, 2019లో వైఎస్సార్‌సీపీ నుంచి రెండుసార్లు భీమునిపట్నం ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్‌ఆర్‌సీపీలో చేరకముందు 2024లో టీడీపీ తరపున అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. కాపు సామాజికవర్గం నుంచి వచ్చిన ఇద్దరు నేతలకు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది.

8. కేతిరెడ్డి

ధర్మవరం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన వై.సత్య కుమార్‌పై పోటీకి దిగారు. కేతిరెడ్డి 2009లో ప్రత్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణపై కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. 2019 ఎన్నికల్లో YSRCP టిక్కెట్‌పై ఆయన రెండవసారి విజయం సాధించారు.

'గుడ్ మార్నింగ్ ధర్మవరం' అనే కార్యక్రమం ద్వారా తన నియోజకవర్గంలోని ప్రజలతో మమేకమై, ఉదయాన్నే ఆయా ప్రాంతాలను సందర్శించి ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు కేతిరెడ్డి. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వెళుతుంటారు. వార్డు సందర్శనలలో భాగంగా అతని వీడియోలు బాగా పాపులర్. సోషల్ మీడియా పేజీలలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.

9. బుగ్గన రాజేంద్రనాథ్

డోన్ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌కి టీడీపీకి చెందిన కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డికి మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రముఖ నేత నీలం సంజీవ రెడ్డి 1962 ఎన్నికలలో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేశారు. 1977 నుండి 1982 వరకు ఆంధ్రప్రదేశ్‌కి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతేకాకుండా భారతదేశానికి ఆరవ రాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత ఈ నియోజకవర్గం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఏపీకి చెందిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన జయసూర్య ప్రకాష్ రెడ్డి ఈ నియోజకవర్గంలో బరిలోకి దిగారు. ఈ ప్రాంతంలో ఆసక్తికరమైన పోరు సాగనుంది. 2004లో సూర్య ప్రకాష్ భార్య కోట్ల సుజాతమ్మ గెలిచారు. సూర్య ప్రకాష్ కర్నూలు నుంచి లోక్ సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపగా, టీడీపీ ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది.

10. కింజరాపు అచ్చెన్నాయుడు

టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు, వైఎస్సార్‌సీపీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నుంచి పోటీకి దిగిన కిల్లి కృపారాణితో త్రిముఖ పోటీకి దిగనున్నారు. ఆమె ఇటీవలే వైఎస్సార్‌సీపీ నుండి మారారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎనిమిది సార్లు టీడీపీ గెలిచింది. 1994లో టెక్కలి నుంచి ఎన్టీ రామారావు విజయం సాధించారు. టెక్కలి, గతంలో హరిశ్చంద్రపురం సెగ్మెంట్‌లో కింజరాపు కుటుంబానికి బలమైన స్థానంగా ఉంది. అచ్చెన్నకు ఈ ప్రాంతంలో బలమైన ఓటు బ్యాంకు ఉందని చంద్రబాబు నాయుడు గట్టి నమ్మకంతో ఆయన గెలుపునకు కృషి చేస్తున్నారు.

Next Story