రాజమండ్రిలో కల్తీ పాల ఘటన.. 15కు చేరిన మృతుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ పాలు సృష్టించిన విషాదం కొనసాగుతోంది. పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలవడం వల్ల సంభవించిన మరణాల సంఖ్య శుక్రవారం...

By -  అంజి
Published on : 14 March 2026 11:25 AM IST

రాజమండ్రిలో కల్తీ పాల ఘటన.. 15కు చేరిన మృతుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ పాలు సృష్టించిన విషాదం కొనసాగుతోంది. పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలవడం వల్ల సంభవించిన మరణాల సంఖ్య శుక్రవారం ఉదయానికి 15కు చేరుకుంది. రాజమహేంద్రవరంలోని రెండు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఈ విషాదం మరింత ముదిరింది. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు బాధితులు కేవలం మూడు గంటల వ్యవధిలో కన్నుమూశారు.

పాలల్లో కలిసిన రసాయనాల కారణంగా వీరి మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినడమే మరణానికి ప్రధాన కారణమని వైద్యులు ధృవీకరించారు. తూర్పుగోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డి అనంతలక్ష్మి (55), కడలి కృష్ణారావు (73) అనే ఇద్దరు బాధితులు శుక్రవారం మృతి చెందారు. ప్రస్తుతం మరో ఐదుగురు బాధితులు మూత్రపిండాల సమస్యతో మృత్యువుతో పోరాడుతున్నారు.

ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఒకే వ్యాపారి సరఫరా చేసిన పాలను తాగిన సుమారు 20 మంది (ముగ్గురు పసికందులతో సహా) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్వహించిన పరీక్షల్లో, పాలల్లో అత్యంత ప్రమాదకరమైన 'ఇథిలీన్ గ్లైకాల్' కలిసినట్లు నిర్ధారణ అయింది. బాధితులందరికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్స అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చికిత్సను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ నుండి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించింది.

Next Story