ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.

By Srikanth Gundamalla  Published on  10 Sep 2023 5:17 AM GMT
ACB Court, Chandrababu , Skill Development Scam,

ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ అధికారులు.. ఆదివారం ఉదయమే ఆయన్ని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ఈ స్కాంకు సంబంధించి 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్టును సీఐడీ అధికారులు కోర్టుకు అందజేశారు. ఆ తర్వాత చంద్రబాబు రిమాండ్‌ రిపోర్ట్‌పై ఏసీబీ కోర్టు విచారణ మొదలైంది. చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి బృందం తమ వాదనలు వినిపించారు. విచారణ ప్రక్రియ ప్రారంభం అయ్యాక 30 మంది న్యాయవాదులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలని కోర్టు సూచించింది. అంతకు మించి ఉంటే విచారణ ప్రక్రియ మొదలు కాదని తెలిపింది. దాంతో.. కేవలం 30 మంది మాత్రమే ఉండిపోయి.. మిగతా వారంతా ఏసీబీ కోర్టు బయటకు వచ్చారు.

చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తామని ముగ్గురు న్యాయవాదులు కోరారు. ఇద్దరికి మాత్రమే అవకాశం ఇస్తామని జస్టిస్‌ హిమ బిందు తెలిపారు. న్యాయవాదులు సిద్ధార్థ లోద్రా, పోసాని వెంకటేశ్వర రావు పేర్లు చెప్పగా అందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. ఏసీబీ కోర్టులో సీఐడీ సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌ను తిరస్కరించాలని న్యాయవాది లూద్రా నోటీసు సమర్పించారు. ఆ తర్వాత వాదనలకు అనుమతి ఇచ్చారు న్యాయమూర్తి. 409 సెక్షన్ కింద వాదనలు కొనసాగాయి. అసలు 409 సెక్షన్‌ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లూద్రా వాదనలు వినిపించారు. 409 పెట్టాలి అంటే ముందుకు సరైన సాక్ష్యం చూపించాలని అన్నారు.

ఆ తర్వాత ఈ కేసులో తన వాదన వినిపించాలని అనుకుంటున్నట్లు న్యాయమూర్తితో చంద్రబాబు తెలిపారు. దానికి జడ్జి అంగీకరించడంతో.. స్వయంగా చంద్రబాబు కూడా ఆయన వాదన ఏసీబీ కోర్టుకు వినిపించారు. తన అరెస్ట్‌ అక్రమమని చంద్రబాబు కోర్టుకు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. రాజకీయ కక్షతోనే తనని అరెస్ట్ చేశారని ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి తెలిపారు చంద్రబాబు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ నిర్ణయమని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపిందన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులను క్రిమినల్‌ చర్యలతో ప్రశ్నించలేరని చంద్రబాబు పేర్కొన్నారు. 2021 డిసెంబర్ 9 నాటికి ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని గుర్తు చేశారు. పూర్తిగా కక్ష సాధింపు పాలన ఏపీలో కొనసాగుతోందని కోర్టు ముందు చెప్పారు చంద్రబాబు. రాష్ట్రంలో ఎక్కడా చట్టబద్ధమైన పాలన జరగడం లేదనీ.. గవర్నర్‌ అనుమతి లేకుండా తనని సీఐడీ అరెస్ట్‌ చేసిందని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు.

Next Story