విజయవాడ రేంజ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతిని అరెస్ట్ చేశారు. తన అధికారిక ఆదాయ మార్గాల కంటే అత్యధికంగా ఆస్తులు కూడబెట్టారనే విశ్వసనీయ సమాచారంతో అధికారులు ఈ దాడులు చేపట్టారు. మంగళవారం తాడేపల్లి, ఉండవల్లి గ్రామాల్లోని ఆమె నివాసంతో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో అధికారులు విస్తుపోయే నిజాలను గుర్తించారు. విశాఖపట్నంలోని ఎండాడలో ఒక లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఒక జి+2 భవనం ఉన్నట్లు గుర్తించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులతో పాటు ఆమె వద్ద 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు లభ్యమయ్యాయి. వీటితో పాటు రూ. 1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ. 3 లక్షల బ్యాలెన్స్, ఒక ఫోక్స్‌వ్యాగన్ పోలో కారు మరియు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఏసీబీ సీజ్ చేసింది.
కలింగిరి శాంతి 2020లో ఏపీపీఎస్సీ ద్వారా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. గతంలో విశాఖపట్నం, విజయవాడల్లో విధులు నిర్వర్తించిన ఆమె, జూలై 2024 నుండి మార్చి 2026 వరకు సస్పెన్షన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న సమయంలోనే ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా కోరారు.