ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల కోసం ఉద్యమం ఊపందుకుంది. అనకాపల్లి జిల్లా చోడవరంలో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం శ్రీనివాసరావు అనే యువకుడు పెట్రోల్ పోసి బైక్‌కు నిప్పంటించడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువకుడిని అడ్డుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పటికే అధికార వికేంద్రీకరణకు మద్దతుగా విప్ కరణం ధర్మశ్రీ రాజీనామా చేసి జేఏసీ నేతలకు రాజీనామా లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఉత్తర జిల్లాల్లో అధికార వికేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నెల 15న విశాఖలో కార్యనిర్వాహక రాజధాని డిమాండ్‌తో గర్జన పేరుతో భారీ నిరసన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఈలోగా బైక్ ర్యాలీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనల్లో ఏపీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.
ఇదే సమయంలో అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు పాదయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. టీడీపీ, జనసేన పలు పార్టీలు అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే అమరావతి రైతుల పాదయాత్ర పొడవునా ఒక్క రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.