పెళ్లి అయిన కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలే
A married daughter is also eligible for a compassionate appointment.ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందినప్పుడు కారుణ్య నియామక ఉద్యోగానికి వివాహిత అయిన కుమార్తె కూడా అర్హురాలేనంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.
By తోట వంశీ కుమార్ Published on 7 March 2021 10:19 AM IST
ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందినప్పుడు అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇచ్చే కారుణ్య నియామక ఉద్యోగానికి వివాహిత అయిన కుమార్తె కూడా అర్హురాలేనంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేటప్పుడు పెళ్లి కాని కుమారై మాత్రమే అర్హురాలని ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చిన సర్య్కులర్‌ను తప్పుబట్టింది. కారుణ్య నియామక అర్హతలలో అవివాహిత అనే పదాన్ని రాజ్యాంగ విరుద్దంగా ప్రకటిస్తూ దాన్ని కొట్టివేసింది. పెళ్లి అయ్యిందన్న కారణంతో దమయంతి అనే మహిళకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వలేమంటూ ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు రద్దు చేసింది. పిటిషనర్ దమయంతిని కారుణ్య నియమకం కింద తగిన ఉద్యోగానికి పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీర్పు వెలువరించారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీహెచ్ పెంటయ్య ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ 2009 మార్చిలో మరణించారు. అతడికి భార్య చిన్నమ్మడు, కుమార్తె దమయంతి ఉన్నారు. మృతుడి భార్య చిన్నమ్మడు కారుణ్య నియామకానికి దరఖాస్తు చేయగా.. అర్హత లేవని అధికారులు తిరస్కరించారు. దీంతో కుమార్తె దమయంతి దరఖాస్తు చేసుకుంది. ఇందుకు చిన్నమ్మడు కూడా నిరభ్యంతర పత్రమిచ్చారు. అయితే..ఆర్టీసీ అధికారులు కారుణ్య నియామకాలపై ప్రభుత్వ నిషేధముందంటూ దమయంతి దరఖాస్తును పక్కన పెట్టారు. దీనిపై ఆమె 2014లో హైకోర్టును ఆశ్రయించారు. దమయంతి దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు అప్పట్లో ఆదేశించింది. కానీ పెళ్లి అయ్యిందన్న కారణంతో దమయంతి దరఖాస్తును ఆర్టీసీ అధికారులు తిరస్కరిస్తూ 2014లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో దమయంతి అదే ఏడాది మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఆర్టీసీ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బ్రెడ్ విన్నర్ పథకం కింద పిటిషనర్ అనర్హురాలు అని.. పెళ్లి అయినందున ఆమె అభ్యర్థనను తిరస్కరించామన్నారు. 2020 మేలో ఆర్టీసీ ఇచ్చిన సర్య్కులర్ ప్రకారం మృతుల భార్య లేదా భర్త, లేదా కుమారుడు లేదా పెళ్లికాని కుమారై మాత్రమే అర్హులు అని తెలిపారు. దమయంతికి పెళ్లి అయినందున ఆమె దరఖాస్తును నిబంధనల ప్రకారం తిరస్కరించామన్నారు. ఈ వాదనతో న్యాయమూర్తి విబేధించారు. జీవో 350 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు అతని భార్య కారుణ్య నియామకానికి ముందుకు రాకపోతే.. ఆ ఉద్యోగికి ఒకే కుమార్తె ఉండి.. ఆమెకు వివాహమైనా కూడా కారుణ్య నియామకానికి పరిగణనలోకి తీసుకోవచ్చు.
ఆర్టీసీ సర్య్కులర్‌లో పెళ్లికానివారే అర్హులన్నారు. అలా చెప్పడం పెళ్లైన కుమారైల పట్ల వివక్ష చూపడమేనన్నారు. కుమారుడికి వివాహం అయిన ఎలాంటి షరతూ విధించలేదు. కుమారులు, కుమారైలు పెళ్లి చేస్తుకున్నారా.. లేదా..? అనే దాంతో సంబంధం లేకుండా జీవితాంతం తండ్రుల కుటుంబంలో వారు భాగమే. కుమారైకు పెళ్లైనంత మాత్రాన ఆమెను తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదని చెప్పడం దారుణమన్నారు. కుమారులు, కుమారైలకు తల్లిదండ్రుల విషయంలో సమాన హక్కులు, విధులు ఉంటాయన్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంది అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ కేసులో పిటిషనర్ దమయంతి ఒక్కరే కుమార్తె. తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. 'బ్రెడ్ విన్నర్ స్కీం' కింద కారుణ్య నియామకానికి దమయంతి అర్హురాలే.. అని న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తన తీర్పులో స్పష్టం చేశారు.