టీకా వేసుకోని వాలంటీర్లు.. షాక్ ఇచ్చిన ప్రభుత్వం
63 Ward Volunteers Dismissed in Atmakur Municipality.కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 4 July 2021 8:37 AM ISTకరోనా వైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక దేశంలోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. టీకాలు వేసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు అవగాహాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా మంది వ్యాక్సిన్లను తీసుకుంటున్నారు. అయితే..కొందరు మాత్రం టీకా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. కరోనా నుంచి రక్షణగా వాలంటీర్లు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.
అయితే.. కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో పని చేసే 63 మంది వాలంటీర్లు టీకా వేయించుకునేందుకు నిరాకరించారు. దీంతో ఈ 63 మందిని విధుల నుండి తొలగిస్తున్నట్లు మున్సిపాలిటీ కమిషనర్ వెంకటదాసు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరుతో పాటు సచివాలయ ఉద్యోగులు హెచ్చరికలు, మెమోలు జారీ చేసినా వారు ఆసక్తి చేపించలేదు. ఈ నెల 1న ఆత్మకూరులో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సంయుక్త కలెక్టరు జిలానీ సామూన్ వాలంటీర్ల వ్యాక్సినేషన్‌పై ఆరా తీశారు. టీకా వేయించుకోని వారిని విధుల నుంచి తొలగించాలని కమిషనరుకు సూచించారు. ఈ విషయాన్ని ఫోన్లో చెప్పినా వాలంటీర్లు స్పందించకపోవడం వల్లే వారిని తొలగించినట్లు కమిషనరు శనివారం వెల్లడించారు. జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు కొత్త వాలంటీర్ల ఎంపిక కోసం సోమవారం నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.