జలాశయంలోకి దూకిన 500 ఆవులు.. ఎందుకంటే..?
500 Cows jump into reservoir in AP's Nandyal district.ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపినివ్వని భారీ వర్షాలతో
By తోట వంశీ కుమార్ Published on 23 July 2022 3:08 AM GMTఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపినివ్వని భారీ వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలు, చెరువులు, కుంటలు అన్ని దాదాపుగా నిండుకుండలను తలపిస్తున్నాయి. నదులు అన్నీఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ సమీపంలో ఎప్పటిలాగే మేతకు వెళ్లిన ఆవుల గుంపుకు అనుకోని పరిస్థితి ఎదురైంది. అడవి పందులు వెంటపడడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు ఆవులు పరుగులు తీశాయి. వెలుగోడు జలాశయంలో దూకాయి.
వివరాల్లోకి వెళితే.. వెలుగోడుకు చెందిన మల్లయ్య, శంకర్, వెంకటరమణ, కూర్మయ్య, పెద్దస్వామి, బాల లింగం, ఈశ్వర్, బూరుగయ్య, సాంబకోటి సుమారు వెయ్యి ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం వీరు గ్రామ సమీపంలోని తెలుగు గంగ జలాశయం పక్కన ఉన్న మైదాన ప్రాంతంలో ఆవుల మందను నిలిపారు. అదే సమయంలో అటుగా అడవి పందుల గుంపు పరుగులు తీస్తూ రావడంతో ఆవులు బెదిరిపోయాయి. దాదాపు 500 ఆవులు జలాశయం కట్టపైకి వెళ్లి జలాశయంలోకి దూకేశాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జలాశయం నిండుగా ఉంది. దీంతో నీటి ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోయాయి.
Around 350 cows were rescued due to the swift action by the fishermen. 2/2 pic.twitter.com/GTBndb3mkD
— Krishnamurthy (@krishna0302) July 22, 2022
వాటి యజమానులు మత్స్యకారుల సాయంతో నాటు పడవలు, పుట్టిలపై జలాశయంలోకి వెళ్లి వాటిని ఒడ్డుకు తోలుకుంటూ వచ్చారు. సుమారు 350 వరకు ఆవులను రక్షించారు. మరో 150 ఆవులు గల్లంతు అయినట్లు తెలుస్తోంది. స్పందించిన అధికారులు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్ద వాటర్ ఇన్‌ఫ్లోను తగ్గించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు సాయంతో రిజర్వాయర్ లో గాలింపు ప్రారంభించారు. వెలుగోడు చేరుకున్న ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇన్‌ప్లోని తగ్గించడంతో ఆవులు ఒడ్డుకు చేరి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆ మూగ జీవాల యజమానులు పడుతున్న వ్యథ మాత్రం వర్ణణాతీతంగా ఉంది. తమ గోవులు తిరిగి క్షేమంగా రావాలని వారు ప్రార్థిస్తున్నారు.