తిరుమలలో బాలుడిపై చిరుత దాడి.. రక్షించిన టీటీడీ విజిలెన్స్ గార్డులు
అలిపిరి-తిరుమల పాదచారుల మార్గంలో 7వ మైలు సమీపంలో గురువారం రాత్రి చిరుతపులి దాడి చేయడంతో మూడేళ్ల బాలుడు తీవ్రంగా
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Jun 2023 3:57 AM GMTతిరుమలలో బాలుడిపై చిరుత దాడి.. రక్షించిన టీటీడీ విజిలెన్స్ గార్డులు
తిరుమల: అలిపిరి-తిరుమల పాదచారుల మార్గంలో 7వ మైలు సమీపంలో గురువారం రాత్రి చిరుతపులి దాడి చేయడంతో మూడేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని రక్షించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాదచారుల మార్గంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ గార్డు, రెండో పట్టణ పోలీసులు బాలుడిని రక్షించారు.
ఆదోనికి చెందిన భక్తుల బృందం తిరుమల కొండపైకి పాదయాత్ర చేస్తుండగా ఈ ఘటన జరిగిందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బాలుడి తండ్రి, తల్లి ముందుకు నడుస్తూ వెళ్తుండగా, బాలుడు, అతని తాత చిప్స్ కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగారు. వారు నడవడం ప్రారంభించిన తర్వాత చిరుత పులి అతడిని శేషాచలం అడవుల్లోకి లాగింది.
''అతని తాత చిరుతపులిని వెంబడించాడు కానీ అది కనిపించలేదు. అదృష్టవశాత్తూ.. తిరుమల టూ టౌన్ ఎస్‌ఐ రమేష్, విజిలెన్స్ గార్డులు సంఘటనా స్థలంలో ఉన్నారు. సమాచారం మేరకు వారు వెంటనే అడవుల్లోకి పరుగులు తీశారు. వారు చిరుతపులిని భయపెట్టడానికి పెద్ద శబ్దాలు చేస్తూ, సెల్ ఫోన్ లైట్లు పెట్టారు'' ధర్మారెడ్డి తెలిపారు.
బహుశా వారి అలికిడికి భయపడిన చిరుతపులి బాలుడిని రిపీటర్ స్టేషన్ దగ్గర వదిలి పారిపోయింది. బాలుడి కేకలు విన్న విజిలెన్స్ గార్డు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని రక్షించారు. అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స అందించి పద్మావతి పిల్లల ఆసుపత్రికి తరలించారు. "బాలుడు క్షేమంగా ఉన్నాడు. మెడ, తలపై గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తర్వాత భక్తులను పాదచారుల నడక ద్వారా అనుమతించాం. అయితే గుంపులుగా వెళ్ళమని సలహా ఇస్తున్నాం" అని ఈవో తెలిపారు.
శుక్రవారం ఉదయం టీటీడీ ట్రస్టుబోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆస్పత్రిని సందర్శించి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
శేషాలం - చిరుతపులికి నిలయం:
- తూర్పు కనుమలు, తిరుపతి సమీపంలో ఉన్న శేషాచలం అడవులు అనేక చిరుతపులిలకు నిలయం
- గతంలో కూడా భక్తులపై చిరుతపులి దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. 2019 జూన్‌లో పాదచారుల మార్గంలో తిరుమలకు వెళ్తున్న ఇద్దరు యువ భక్తులపై చిరుతపులి దాడి చేసింది.
- 2021 డిసెంబర్‌లో తిరుమల ఘాట్ సెక్షన్‌లో చిరుతపులి దాడిలో ఇద్దరు వాహనదారులు గాయపడ్డారు. టీటీడీ ఉద్యోగులు విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఘాట్ రోడ్డులో చిరుతపులి వాహనదారులు, ఉద్యోగులపై దాడి చేసింది.