పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో యువతి సజీవ దహనమైన ఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముళ్లపూడి నాగహారిక (19) ఇంట్లోని బెడ్‌రూమ్‌లోని బెడ్‌పై సజీవ దహనమైంది. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా హత్య చేసి కాల్చి చంపారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్, రూపారాణి దంపతుల కుమార్తె నాగహారిక శుక్రవారం రాత్రి తన గదిలో నిద్రించింది.
ఉదయం మంచంపై నాగహారిక కాలిపోయి చనిపోయి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూపారాణి నాగహారికకు సవతి తల్లి, ఆమెకు మంజలి ప్రియ అనే తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. ఇటీవలే కొత్త ఇల్లు నిర్మించుకుని మూడు నెలల క్రితం నివాసం ఉంటున్నారు. అయితే ఇంటి సామాగ్రి పూర్తిగా మార్చకపోవడంతో యువతి తండ్రి ముళ్లపూడి శ్రీనివాస్ పాత ఇంట్లోనే నిద్రించాడు. శనివారం ఉదయం కొత్త ఇంటికి వచ్చి భార్యను నిద్ర లేపి చూడగా కూతురు నిద్రిస్తున్న గదిలో నుంచి పొగలు రావడం గమనించాడు.
నాగహారిక అప్పటికే మంటల్లో కాలిపోయింది. తండ్రి ముళ్లపూడి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు రూరల్ సిఐ సిహెచ్ ఆంజనేయులు, ఎస్‌ఐ రాజ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ సిబ్బంది, డాగ్‌స్క్వాడ్ ఘటనా స్థలం నుంచి పలు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి నాగహారిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.