మహిళా సంఘాలకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అమలు చేసే కార్యక్రమాలకు...
By - అంజి |
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామీణ పేదరిక నిర్మూలనకు రూ.1,877 కోట్లు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అమలు చేసే కార్యక్రమాలకు రూ.1,877 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో మహిళా సాధికారత, గ్రామీణ జీవనోపాధి మెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది కేటాయించిన రూ.1,877 కోట్లు గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.143 కోట్లు అధికం. ఇది స్వయం సహాయక సంఘాల మహిళలను శక్తివంతం చేయాలన్న ప్రభుత్వ నిశ్చయానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. సెర్ప్ సిబ్బంది, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు మరియు గ్రామ సంఘాల సహాయకుల జీతభత్యాలు, గౌరవ వేతనాలతో పాటు సెర్ప్, డి.ఆర్.డి.ఎ కార్యాలయాల నిర్వహణ కోసం రూ.465 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.
జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కోసం అత్యధికంగా రూ.818 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త వ్యాపారాలను ప్రోత్సహించేందుకు రూ.72 కోట్లు కేటాయించారు. మహిళా రైతుల అభివృద్ధి కోసం రూ.30 కోట్లు కేటాయించారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థల కోసం రూ.15 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, కేంద్రం నుండి వచ్చే నిధుల ఆధారంగా సెర్ప్ బడ్జెట్‌ను అదనంగా మరో రూ.1,200 కోట్లు పెంచే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దీనివల్ల 2026-2027లో మొత్తం వ్యయం రూ.3,000 కోట్లకు చేరుకుంటుంది. ఈ నిధులతో మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు సృష్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త
ఈ వినూత్న పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (FPOs) బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.