ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌

11 TDP MLA's suspention from AP Assembly today.ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల‌ సస్పెన్షన్ల పర్వం కొన‌సాగుతూనే ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 March 2022 7:45 AM GMT
ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల‌ సస్పెన్షన్ల పర్వం కొన‌సాగుతూనే ఉంది. స‌భా కార్య‌క‌లాపాల‌కు అడ్డుప‌డుతున్నారంటూ శాస‌న‌స‌భ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. జంగారెడ్డి గూడెం ఆకస్మిక మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ టీడీపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలి అంటూ స్పీకర్ పోడియం చుట్టు ముట్టి నిరసన తెలిపారు. హుందాగా వ్యవహరించాలని ఇటు ముఖ్య‌మంత్రి జగన్, అటు స్పీకర్ సైతం కోరినా టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గలేదు. ఎంత చెప్పినా టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో అసెంబ్లీ నుండి 11 మంది ఎమ్మెల్యేలను సస్పెన్షన్‌ చేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌, వెల‌గ‌పూడి రామకృష్ణబాబు, బెందాళం అశోక్‌, గొట్టిపాటి ర‌వికుమార్, ఆదిరెడ్డి భ‌వాని, గ‌ణ‌బాబు, జోగేశ్వ‌ర‌రావు, గ‌ద్దె రామ్మోహ‌న్, ఎం.రామ‌రాజు, ఏలూరి సాంబ‌శివ‌రావు, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌ల‌ను శాస‌న‌స‌భ నుంచి ఒక్క రోజు పాటు సస్పెండ్ చేసిన‌ట్లు స్పీక‌ర్ తెలిపారు. ఇక సోమ‌వారం ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేల‌ను శాస‌న‌స‌భ నుంచి సస్పెండ్ చేశారు. వారిపై బ‌డ్జెట్ స‌మావేశాలు పూర్త‌య్యే వ‌ర‌కు స‌స్పెన్ష‌న్ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే.

అంతకుముందు ముఖ్య‌మంత్రి జగన్ మాట్లాడుతూ.. టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలన్నారు. క‌ల్తీ సారా ఘ‌ట‌న‌పై క్లారిటీ ఇచ్చారు. అక్ర‌మ మ‌ద్యాన్ని అరిక‌ట్ట‌డానికి ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చామ‌న్నారు. రెండు సంవ‌త్స‌రాల్లో 13 వేల కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. 55వేల జనాభా ఉన్న చోట ఎవరైనా సారా కాస్తారా? నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సారా తయారీ సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే నమ్మే విధంగా ఉండాలన్నారు. సారా కాచే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని తెలిపారు.

Next Story