బ‌న్ని ఉత్స‌వం.. చెల‌రేగిన హింస.. 100 మందికిపైగా గాయాలు, 9 మంది పరిస్థితి విషమం

100 People injured in Bunny Utsavam.ప్ర‌తి ఏటా ద‌స‌రా రోజున జ‌రుగుతున్న క‌ర్నూలు జిల్లాలోని హోళ‌గుంద మండ‌లం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Oct 2021 8:38 AM IST
బ‌న్ని ఉత్స‌వం.. చెల‌రేగిన హింస.. 100 మందికిపైగా గాయాలు, 9 మంది పరిస్థితి విషమం

ప్ర‌తి ఏటా ద‌స‌రా రోజున జ‌రుగుతున్న క‌ర్నూలు జిల్లాలోని హోళ‌గుంద మండ‌లం దేవ‌ర‌గ‌ట్టు మాళ మ‌ల్లేశ్వ‌స్వామి బ‌న్ని జైత్ర‌యాత్ర శుక్ర‌వారం అర్థ‌రాత్రి ప్రారంభ‌మైంది. ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు.. అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు మ‌రోవైపు విడిపోయి కర్రలతో తలపడ్డారు.ఉత్స‌వంలో చెల‌రేగిన హింస‌లో సుమారు వంద మందికి పైగా గాయ‌ప‌డ్డారు. వెంట‌నే వీరిని ఆదోనిలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో తొమ్మిది మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

సుమారు 800 అడుగుల ఎత్తైన కొండ‌పైన మాళ మ‌ల్లేశ్వ‌ర‌స్వామి ఆలయంలో ద‌స‌రా బ‌న్ని ఉత్స‌వానికీ ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. నిన్న రాత్రి 12 గంట‌ల‌కు స్వామి వారి క‌ళ్యాణం జ‌రిగింది. అనంత‌రం స్వామి వారిని ఉరేగిస్తారు. ఉత్సవ మూర్తులను మేళతాళాలతో కొండదిగువున సింహసన కట్టవద్దకు చేరుస్తారు అక్కడే.. స్వామి వారిని ద‌క్కించుకునేందుకు భ‌క్తులు రెండు వ‌ర్గాలుగా విడిపోయి త‌ల‌ప‌డుతుంటారు.

కాగా.. ఈ సారి హింసను ఈసారి నిరోధించేందుకు పోలీసులు పకడ్బంధీగా చర్యలు తీసుకున్నారు. ఐర‌న్ రంగులు తొడిగిన క‌ర్ర‌ల‌తో గ్రామ‌స్తులు త‌ల‌ప‌డ‌టానికి సిద్ద‌మ‌వ్వ‌గా పోలీసులు అటువంటి సుమారు 500 క‌ర్ర‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అల్ల‌ర్ల‌కు పాల్ప‌డ‌తార‌ని అనుమానిస్తున్న 160 మందిని మూడు రోజుల ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికి ప్ర‌తి ఏటాలాగే వంద మందికి పైగా త‌ల‌లు ప‌గిలాయి. కాగా.. ఈ ఉత్సవంపై మానవ హక్కుల కమిషన్‌తో పాటు లోకాయుక్త కూడా సీరియస్ అయ్యాయి. కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. క‌ళ్ల ముందే ఇంత హింస జ‌రుగుతున్నా కూడా పోలీసులు ఆప‌లేక‌పోతున్నార‌ని వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయినప్పటికీ దేవరగట్టులో హింస జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Next Story