ఏపీ శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తత
By సుభాష్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన మండలిలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దుపై చర్చ కొనసాగుతోంది. కాగా, సభలో మాట్లాడేందుకు మండలి చైర్మన్ టీడీపీ సభ్యులకు 84 నిమిషాలు, టీడీపీ నామినేటెడ్ సభ్యులకు 8 నిమిషాలు, వైసీపీ సభ్యులకు 27 నిమిషాలు, స్వతంత్ర సభ్యులకు 9 నిమిషాల సమయం కేటాయించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. అమరావతిలో సీఎం ఒక్క రోజు కూడా పర్యటించలేదని, దాదాపు అన్ని భవనాల నిర్మాణం కూడా పూర్తయిందన్నారు. రాజధానిని తరలిస్తే అమరావతిలో పెట్టిన ప్రజాధనం వృధా అవుతుందన్నారు. అన్ని కార్యాలయాలు ఒకే చోటు ఉండాలని కేంద్ర సర్కార్ చెబుతుంటే.. జగన్ మాత్రం మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు ముందుకెళ్తున్నారని ఆరోపించారు. దక్షిణాఫ్రికాలో తప్ప ఎక్కడా మూడు రాజధానులు లేవన్నారు.
మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... తాము వెనుకబడిన ప్రాంతాల గురించి ఆలోస్తామని, అమరావతిలో టీడీపీ నేతల భూ దోపిడీకి అంతే లేదని ఆరోపించారు. ఈ క్రమంలో అవంతి ప్రసంగానికి టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అడ్డుతగిలారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది
లోకేష్ సెల్‌ఫోన్ చూస్తూ మాట్లాడుతుండగా..
మండలిలో నారా లోకేష్ సెల్‌ఫోన్ చూస్తూ మాట్లాడటంపై మంత్రి బోత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పరిశీలించి రూలింగ్ ఇవ్వాలని మండలి వైస్ చైర్మన్‌ను కోరారు. దీనిపై ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం కల్పించుకుని మండలిలో వైఫై సౌకర్యం ఉందని, సెల్‌ఫోన్‌లో నోట్స్ చూస్తూ మాట్లాడి తప్పేంటని ప్రశ్నించారు. అనంతరం లోకేష్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.