అనంత పద్మనాభ స్వామి నిర్వహణ బాధ్యతలు ట్రావెన్‌కోర్‌ కుటుంబానికే.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

By సుభాష్  Published on  13 July 2020 9:39 AM GMT
అనంత పద్మనాభ స్వామి నిర్వహణ బాధ్యతలు ట్రావెన్‌కోర్‌ కుటుంబానికే.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్‌ కోర్‌ రాజకుటుంబానికేనని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పంది. ఆలయ పర్యవేక్షనను ఇక తిరువనంతపురం జిల్లా జడ్జి ఆధ్వర్యాన గల కమిటీ చూసుకుంటుందని కోర్టు పేర్కొంది. ప్రధాని కమిటీ ఏర్పాటు అయ్యేంత వరకు ఈ పద్దతి అమలులో ఉంటుందని, కమిటీలో ట్రావెన్‌కోర్‌ రాయల్‌ ఫ్యామిలీ కీలక పాత్ర వహిస్తుందని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

అయితే ఆలయ అంతర్భాగంలో నాలుగు సెల్లార్లలో కోట్లాది విలువైన బంగారు అభరణాలు, ముత్యాలు ఉన్నట్లు 2011లో నిర్వహించిన ఓ తనిఖీలో వెల్లడైంది. ఆ తర్వాత కొన్ని వందల కిలోల బంగారు అభరణాలు మాయమైనట్లు కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఈ ఆలయం చాలా కాలంగా అంతగా గుర్తింపు లేకున్నా.. 2011లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ ఆలయ రహస్య తలుపులను తెరవగా, అందులో లక్షల కోట్ల విలువైన నిధి నిక్షేపాలు లభ్యమయ్యాయి. దీంతో ఆ ఆలయం ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా అత్యంత విలువైన ఆలయంగా మారిపోయింది. అయితే అన్ని గదులను తెరిచిన నిపుణులు.. ఒక గది తలుపు మాత్రం తెరవలేదు. ఆ గది తలుపులు కొందరు తెరవాలని, మరి కొందరు తెరవొద్దని ఇలా ఎవరికి వారు అనుకూలంగా వాదిస్తూ వచ్చారు. అందుకు నాగబంధం ఉండటంతో ఆ గది తలుపులు తెరిస్తే ప్రళయం వస్తుందని కొందరు వాదిస్తున్నారు. ఆ తలుపు తెరవాలా వద్దా అనేది ఎవరు నిర్ణయించాలో తెలియలేదు.

అయితే 1991లో ట్రావెన్‌కోర్‌ చివరి పాలకుడు మృతి చెందిన తర్వాత రాజ కుటుంబ హక్కులు నిలిచిపోయాయని కేరళ హైకోర్టు 2011లో తీర్పు ఇచ్చింది. ఇక ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఒక ట్రావెన్‌ కోర్‌ ఏర్పాటు చేయాలని తెలిపింది. అదే విధంగా ఆరో గది తలుపు తెరవాలని కూడా ఆదేశించింది. దీంతో ఆరో గది తలుపు తెరవడం ఇష్టం లేని ట్రావెన్‌ కోర్‌ వంశీయులు ఆలయంపై హక్కులు తమకే ఉన్నాయంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇక 9 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. చివరి పాలకుడు మరణం వల్ల కుటుంబ హక్కులు రద్దు చేయబడవని పేర్కొంది. ఆలయ నిర్వహణ బాధ్యతలు రాజకుటుంబానికే చెందుతాయని స్పష్టం చేసింది. అయితే ఆరోగది తలుపు తెరవాలా.. వద్దా.. అనేది ట్రావెన్‌ కోర్‌ కుటుంబం నిర్ణయం తీసుకోనుంది.

Next Story