ట్రంకు పెట్టెలో బయటపడ్డ నిధి ఆ ఉద్యోగిదే
By సుభాష్ Published on 20 Aug 2020 8:19 AM ISTఏపీలో ట్రంకు పెట్టెలో బయటపడ్డ బంగారం తీవ్ర సంచలన రేపుతోంది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో 8 ట్రంకుపెట్టెల్లో బయటపడిన బంగారం, వెండి అభరణాలు ఖజానా శాఖ ఉద్యోగికి చెందినవేనని పోలీసులు తేల్చారు. బుక్కరాయసముద్రానికి చెందిన డ్రైవర్ వద్ద ఖజానాశాఖలో పని చేసే సీనియర్ అకౌంటెండ్ మనోజ్ కుమార్ పెట్టెలు దాచిపెట్టాడన్న పక్కా సమాచారం మేరకు ఇంటిపై పోలీసులు దాడి చేశారు. దీంతో ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన2.42 కిలోల బంగారం, 84.10 కిలోల వెండి అభరణాలు, రూ.15,55,560 నగదు, రూ.49.10 లక్షల విలువ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ.27.05 లక్షల విలువ చేసే బాండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు కార్లు, 7 బైక్‌లు, 4 ట్రాక్టర్లు సీజ్ చేశారు పోలీసులు.
అయితే పోలీసులు సీజ్ చేసిన ద్విచక్రవాహనాల్లో మూడు బైక్‌లు ఖరీదైనవిగా ఉన్నాయి. మూడు 9ఎంఎం పిస్టళ్లు, తూటాలు, ఒక ఎయిర్‌గన్ పట్టుబడ్డాయి. ఇంతపెద్ద ఎత్తున పట్టుబడ్డ బంగారం, నగదు, ఇతర అభరణాలన్నీ ఖజానా శాఖ ఉద్యోగి మనోజ్‌కుమార్‌కు చెందినవేనని జిల్లా పోలీసు కార్యాలయ ఓఎస్టీ రామకృష్ణప్రసాద్ తెలిపారు. తన కారు డ్రైవర్ నాగలింగం మామ ఇంట్లో పెట్టెలు దాచాడని పోలీసులు వివరించారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఖజానా ఉద్యోగి ఇంత భారీ మొత్తంలో ఎలా సంపాదించాడన్న విషయంపై అవినీతి నిరోధక శాఖ విభాగానికి కేసును బదలాయిస్తున్నట్లు ఓఎస్డీ పేర్కొన్నారు.