ప్రేమించమంటూ వెంటపడ్డాడు.. కాదనేసరికి గొంతు కోశాడు
By తోట వంశీ కుమార్ Published on 8 May 2020 12:58 PM IST
లాక్‌డౌన్ లోనూ మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు ఆగడంలేదు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. బ్లేడ్‌తో బాలిక గొంతు కోశాడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గుత్తిఅనంతపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు (21) ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ బాలిక(14)ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ఆ బాలిక స్థానిక పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉంటోంది. కాగా.. శుక్రవారం ఉదయం బాలిక తల్లిదండ్రులు ఉపాధి పనుల కోసం బయటికి వెళ్లారు. ఇదే అదునుగా బావించిన రామాంజనేయులు బాలిక ఇంటికి వెళ్లి మరో సారి ఆమెను ప్రేమిస్తున్నాని చెప్పాడు. బాలిక తాను ప్రేమించడం లేదని చెప్పింది. ఈ క్రమంలో వాగ్వాద్దానికి దిగాడు. సహానం కోల్పోయి బ్లేడ్‌తో ఆ బాలిక గొంతు కోశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గమనించిన ఇరుపొరుగు వారు బాలికను గుత్తి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో బాలికను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.