నల్గొండ: మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ప్రణయ్‌ భార్య.. తన తల్లి గిరిజను కలిశారు. మిర్యాలగూడలోని మారుతీరావు ఇంటికి వెళ్లిన.. అమృత తన తల్లిని కలిసి ఓదార్చారు. శనివారం సాయంత్రం తండ్రి మారుతీరావు మరణం తర్వాత.. తల్లి గిరిజను అమృత కలిశారు. మారుతీరావు ఇంటికి వచ్చిన అమృతకు పోలీసులు రక్షణ కల్పించారు. మారుతీరావు చనిపోయే ముందు.. తల్లి దగ్గరకు వెళ్లాలని కూతురు అమృతను కోరుతూ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే అమృత తన తల్లిని కలిసింది. కాగా మారుతీరావు ఆత్మహత్య తర్వాత తన బాబాయ్‌ శ్రవణ్‌పై అమృత తీవ్ర ఆరోపణలు చేసింది. తన తండ్రి ఆత్మహత్యకు అతడి వేధింపుల కారణమంటూ ఆమె అనుమానం సైతం వ్యక్తం చేశారు.

మారుతీరావు అంత్యక్రియలు జరిగిన మిర్యాలగూడెలోని హిందూ స్మశాన వాటిక వద్దకు అమృత పోలీసుల భద్రతతో తన తండ్రిని చివరిసారిగా చూసేందుకు వెళ్లింది. అక్కడ ఆమెను మారుతీరావు కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. గోబ్యాక్‌ అమృత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉధ్రిక్తత పరిస్థితి నెలకొనడంతో తండ్రిని ఆఖరి చూపు చూడకుండానే అమృత వెనుదిరిగింది.

అనంతరం ఆమె మీడియా సమావేశం నిర్వహించి తన బాబాయ్‌ శ్రవణ్‌ నుంచి అమ్మకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను అమ్మదగ్గరకు వెళ్లనని, అమ్మ నా దగ్గరకు వస్తే చూసుకొనే బాధ్యత నాదని తెలిపింది. విలేకరుల సమావేశం అనంతరం సాయంత్రం సమయంలో పలు చానెల్స్‌ వారు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో అమృత ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది.

అంజి గోనె

Next Story