ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఇకముందు, ఆమె ఢిల్లీలోని కేబినెట్ సెక్రెటేరియట్ లో డిప్యూటీ కార్యదర్శిగా పనిచేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధుల్లో చేరే అతి పిన్న వయస్కురాలు ఈమె. ఆమ్రపాలి ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సంఘం అధికారిణిగా పనిచేస్తున్నారు.

అక్టోబర్ 28, 2019న పర్సనల్ & ట్రైనింగ్ శాఖ నుంచి ఉత్తరువులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఉత్తరువు “ఆమ్రపాలి కాట ను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వమే సిఫారసు చేసిందనీ, సెంట్రల్ స్టాఫింగ్ స్కీం కింద 4 ఏళ్ల వరకూ కాబినెట్ సెక్రటేరియట్ కు డిప్యూటీ కార్యదర్శిగా ఆమె ఎన్నికయ్యారు.” అని తెలియపరుస్తుంది
కేటాయించిన పనిలో చేరేందుకు వీలుగా ఆమెను విధుల నుండి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఉత్తరువులు జారీ చేసింది. కొన్ని నెలల క్రితం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ఆమె ప్రైవేట్ సెక్రెటరీగా కూడా ఎన్నికయ్యారు.

విశాఖపట్నానికి చెందిన ఆమ్రపాలి, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కలెక్టర్ గా, జిహెచ్ ఎం సి లో, తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం లో… ఇలా ఎన్నో రంగాల్లో విధులు నిర్వర్తించారు.

2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి, 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సమీర్ శర్మా ను వివాహం చేసుకున్నారు.

సత్య ప్రియ బి.ఎన్