వారిద్దరూ భేటీ అయితే.. ఆయనకెందుకు భయం..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 3:23 PM GMT
వారిద్దరూ భేటీ అయితే.. ఆయనకెందుకు భయం..?!

ఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఈ నెల 21న సీఎం జగన్, కేంద్ర హోంమంత్రి భేటీ జరగనుంది. ఈ మేరకు అమిత్ షా కార్యాలయం, ఏపీ సీఎంవో కు సమాచారం అందించింది. ఈ నెల 14నే అమిత్ షాతో జగన్‌ భేటీ కావాల్సి ఉన్నప్పటికీ..బీజేపీ అధ్యక్షుడు మహారాష్ట్ర ఎన్నికల్లో బిజీగా ఉండటంతో సమావేశం వాయిదా పడింది. అయితే.. సోమవారం జగన్‌కు అమిత్ షా అపాయింట్ ఇచ్చారు.

అమిత్ షాతో జగన్ భేటీ అనగానే టీడీపీలో వణుకు మొదలైనట్లు సమాచారం. గత ప్రభుత్వం ఏపీలో చేసిన అవినీతిని అమిత్ షాకు చెప్పే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. రాష్ట్రాన్ని ఎలా దివాళ తీయించింది..రాజకీయంగా కాంగ్రెస్‌తో కలిసి తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అన్ని అమిత్ షాకు జగన్‌ చెబుతారని వైఎస్ఆర్‌ సీపీ నేతలు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. అమిత్ షా కూడా కాంగ్రెస్ బాధితుడే.సో.. జగన్ విషయంలో అమిత్ షా సానుకూలంగా ఉంటారని కూడా చెప్పుకుంటున్నారు.

బీజేపీతో జత కట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన యత్నాలు ఫలించడం లేదు. బీజేపీతో విడిపోయి తప్పు చేశామని బాబు ఇప్పటికే ప్రకటించారు. ఇక..టీడీపీతో భవిష్యత్తులో కలిసే ప్రసక్తేలేదని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ జీవీఎల్ కుండబద్దలు కొట్టారు. దీంతో, అమిత్ షాతో జగన్ సమావేశం జరిగితే మొదట నష్టపోయేది చంద్రబాబు నాయుడే అని పొలిటికల్ టౌన్‌లో అంచనా వేస్తున్నారు.

అమిత్ షా జగన్‌కు అపాయింట్ మెంట్ ఇవ్వడంతో టీడీపీ నేతల్లో ఎక్కడో మూల భయం మొదలైందని చెప్పుకుంటున్నారు. టీడీపీకి ఎంత అనుకూల మీడియా ఉన్నప్పటికీ..బాబును బీజేపీకి దగ్గర చేయలేకపోయారు. ఈ మధ్య ఓపత్రికాధిపతి అమిత్ షాను కలిస్తే...ఆయనను కేంద్ర హోంమంత్రి అడగాల్సినవి అన్ని అడిగి పంపినట్లు సమాచారం. దీంతో ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సంబంధిత పత్రికాధిపతి ఢిల్లీ నుంచి సైలెంట్ గా వచ్చారట. దీంతో చంద్రబాబును బీజేపీకి దగ్గర చేయాలనే ప్రయత్నాలు అక్కడితో ఆగిపోయాయని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక..అమిత్ షాను జగన్ కలిసిన తరువాత ఏపీ రాజకీయాల్లో పెను తుఫాను రావచ్చు.

Next Story