అమెజాన్.. పరేషాన్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Sept 2019 12:57 PM ISTభూమికి ఆయువు పట్టులాంటి అమెజాన్ అడవులను మంటలు చుట్టుముట్టాయి. మానవాళికి అవసరమైన ఆక్సిజన్‌లో 20 శాతానికిపైగా ప్రాణవాయువును అందిస్తోన్న అమెజాన్ అడవులు కళ్ల ముందే కాలి బూడిదవతున్నాయి. ఈ అడవులలోని దావాగ్ని అంతరిక్షం నుంచి సైతం కనిపిస్తోందంటే.. ఆ మంటలు ఎంతలా ఎగిసిపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
బ్రెజిల్‌లోని రొరైమా, అక్రే, రొండోనియా, అమెజానోస్ రాష్ట్రాల్లో అగ్నికిలలు ఎగసి పడుతున్నాయి. ఈ ప్రాంతంలో రాత్రుళ్లు కూడా ఆకాశం ఎర్రగా కనిపిస్తోందంటే.. అక్కడ మంటల తీవ్రత ఎంతలా ఉందో తలచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. నాసా, యూరోపియన్ యూనియన్ ఉపగ్రహాలు అమెజాన్ అడవుల్లో మంటలు వ్యాపించడాన్ని గుర్తించాయి. ఈ కార్చిచ్చు కారణంగా అడవి చుట్టు పక్కల ప్రాంతాల్లో మొదలుకొని దూర ప్రాంతాలకు కూడా దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి.
దక్షిణ అమెరికా దేశాలైన బ్రెజిల్, పెరూ, కొలంబియాలలో అమెజాన్ అడవులు విస్తరించాయి. ప్రపంచానికి ప్రాణవాయువు లాంటి ఈ అడవులు మనిషి దురాశ కారణంగా అగ్నికి ఆహుతి అవుతున్నాయి. అమెజాన్ అడవులున్న ప్రాంతాలు మాములుగా అయితే చిత్తడిగా ఉంటాయి. కానీ జూలై నుంచి అక్టోబర్ వరకు.. ముఖ్యంగా ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ అడవుల్లో పొడి వాతావరణం ఏర్పడుతుంది.
దీంతో సాగు కోసం అక్కడి ప్రజలు అడవులను తగలబెడుతున్నారు. వేసవిలో సాధారణంగా వ్యాపించే మంటలకు ..మానవ తప్పిదం కూడా తోడవడంతో అమెజాన్ అడవులు భారీ స్థాయిలో తగలబడుతున్నాయి. ఇదిలావుంటే .. ఒక్క 2019లోనే అమెజాన్ అడవుల్లో 73 వేల సార్లు మంటలు వ్యాపించినట్టు బ్రెజిల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. గత ఏడాది కంటే ఇది 83 శాతం అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే అడవుల నరికివేత కూడా 88 శాతం పెరగడం గమనార్హం. దీనిపై పర్యావరణ ప్రేమికులు తీవ్రంగా కలత చెందుతున్నారు.
అమెజాన్ అడవులలో దావాగ్ని కారణంగా బ్రెజిల్ అధ్కక్షుడు జైర్ బొల్సోనారో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. అమెజాన్ అడవుల్లో సాగును అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారని ప్రపంచ దేశాలు , బ్రెజిల్‌లోని కొన్ని రాష్ట్రాల ప్రజలు ఆయనపై మండిపడుతున్నారు. అడవుల నరికివేతను బోల్సోనారో ప్రోత్సహిస్తున్నారని బ్రెజిల్ అధికార యంత్రంగం కూడా బహిరంగ ఆరోపణలు చేస్తుంది. అయితే..బ్రెజిల్ అధ్యక్షుడు మాత్రం విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రపంచం గురించి ఆలోచిస్తే తమ దేశానికి ఏమోస్తుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తమ దేశంలో సాగు భూమి తక్కువుగా ఉందని..వ్యవసాయ భూమిని ప్రపంచ దేశాలు ఇవ్వగలవా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అమెరికా, యూరప్ తమకు సలహా ఇచ్చే బదులు..తమ దేశాల్లో అడవులు పెంచుకోవాలంటూ సమాధానం ఇచ్చారు బ్రెజిల్ అధ్యక్షుడు.
అయితే..బ్రెజిల్ అధ్యక్షుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. పెను ముప్పు సంభవించకముందే మంటలను ఆర్పే దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం బ్రెజిల్‌ను కోరుతోంది. అమెజాన్ అడవులు మంటల్లో తగలబడి పోతుండటం పట్ల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు.