బిడ్డ పుడితే భర్తలో జెలసీ పెరుగుతుందా?

By రాణి  Published on  5 March 2020 1:21 PM GMT
బిడ్డ పుడితే భర్తలో జెలసీ పెరుగుతుందా?

రెండో పిల్లాడు పుట్టాక మొదటి పిల్లాడిలో అసూయ బయలుదేరడం. దీంతో పెద్దోడు పసివాడిని ఎవరూ చూడకుండా గిల్లేసి, గిచ్చేసి వెళ్లిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. తనను తల్లీ దండ్రీ పట్టించుకోవడం లేదని పిల్లవాడిలో కసి పెరగడం మామూలే. అయితే అమెరికాలో మాత్రం భార్య భర్తల మధ్య పొరపొచ్చాలుంటే, తొలి బిడ్డను కన్న తరువాత భార్య తనను పట్టించుకోవడం లేదన్న భావన భర్తల్లో బాగా పెరుగుతుందట. ఈ మేరకు తాజాగా వ్యక్తిగత సంబంధాల విషయంలో జరిగిన పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఒహాయో విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ అధ్యయనంలో భర్తల్లో భార్య తనను తిరస్కరిస్తోందన్న అభిప్రాయం పెరుగుతోందని తేలింది.

దీని వల్ల సంతానం పట్ల అసూయ ద్వేషాలు పెరుగుతాయని కూడా అధ్యయనం తెలిపింది. క్రమేపీ భార్యా భర్తల మధ్య పొరపొచ్చాలు పెరిగి, చివరికి విడిపోవడం దాకా దారి తీస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలో న్యూ పేరెంటింగ్ ప్రాజెక్టులో భాగంగా చేసిన అమెరికాలో ప్రస్తుతం ఉన్న సామాజిక సమీకరణాలను,కుటుంబ వ్యవస్థపై ఒత్తిడులను అధ్యయనం చేయడం చేయడం జరిగింది. ఇందులో తొలి బిడ్డ పుట్టాక భార్య తనను నిర్లక్ష్యం చేస్తుందన్న భావన మగవారిలో బలపడుతోందని తెలుస్తొంది. భార్యా భర్తా ఉద్యోగం చేసే సంసారాలపై ఈ అధ్యయనం ప్రధానంగా జరిగింది. అయితే ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో భార్యలు కూడా భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావిస్తోంది. పెళ్లయిన తరువాత లావెక్కడం, శరీరం లూజు కావడం, అవుటాఫ్ షేప్ కావడం వంటి కారణాల వల్ల భర్త తన పట్ల మొదట్లో ఉన్న ఆసక్తిని, ప్రేమను చూపడం లేదని భార్యలు భావించే అవకాశాలున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది.

ఆసక్తికరమైన విషయం చూడండి. ఇదే మన దేశంలోనైతే బిడ్డ పుట్టితే బంధం గట్టిపడుతుందనుకుంటాం. ఒక బిడ్డ పుట్టేస్తే ఇక మొగుడూ పెళ్లాలు కొట్టుకోరని, గిల్లి కజ్జాలు తగ్గిపోతాయన్నది మన భావన.కానీ పాశ్చాత్య దేశాల్లో బిడ్డలు పుట్టినా అవి పొరపొచ్చాలకు, మనస్తాపాలకు, చివరికి విడాకులకు దారి తీసే అవకాశం ఉంది. అదే మనకీ వాళ్లకీ మధ్య తేడా!!

Next Story