విలవిల్లాడుతున్న అమెరికా.. ఒక్క రోజే 1100 మంది కన్నుమూత

By అంజి  Published on  5 April 2020 8:05 AM IST
విలవిల్లాడుతున్న అమెరికా.. ఒక్క రోజే 1100 మంది కన్నుమూత

హైదరాబాద్‌: అమెరికాలో ఆగని మృత్యఘోష.. న్యూయార్క్‌లో ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు మృతి చెందుతున్నారంటూ ఈనాడు దినపత్రిక కథనం రాసింది. ఆ కథనం మేరకు.. మహమ్మారి కొవిడ్‌-19 వైరస్‌ అమెరికాలో విలయ తాండవం చేస్తోంది. వైరస్‌ ధాటికి అమెరికా ప్రజలు విల విల్లాడుతున్నారు. అక్కడ కొద్ది రోజుల నుంచి మరణ మృదంగం మోగుతోంది. శనివారం ఒక్క రోజే 1100 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో మరే దేశంలోనూ ఇంత ప్రాణ నష్టం సంభవించలేదు. న్యూయార్క్‌ రాష్ట్రంలో ప్రతి రెండున్న నిమిషాలకు ఒకరు చొప్పున 630 మంది చనిపోయారు.

ఇటలీ, బ్రిటన్‌, స్పెయిన్‌ దేశాల్లోనూ మృతుల సంఖ్య ఆందోళనకర స్థితిలోనే ఉంది. అమెరికా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. వైద్యానికి సంబంధించిన మాస్కులను వైద్య సిబ్బంది కోసం వదిలి పెట్టాలని అని ట్రంప్‌ అన్నారని దినపత్రిక తన కథనంలో పేర్కొంది. దగ్గు లేదా తుమ్ము ద్వారా కరోనా వ్యాపించే అవకాశాలున్నాయని ట్రంప్‌కు జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ అధిపతి అంటోసీ ఫాసీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ఈ సూచన చేశారపి తెలిసింది. ప్రజల ఆరోగ్యం కోసం అదనపు జాగ్రత్తలు చెప్పిన ట్రంప్‌.. తాను మాత్రం మాస్క్‌ ధరించేది లేదన్నారు. ముఖానికి మాస్క్‌ కట్టుకొని వివిధ దేశాధినేతలకు అభివాదం చేయడం తనకు అస్సలు నచ్చదని ట్రంప్‌ అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 11.30 లక్షలు దాటింది. వీరిలో 2.11 లక్షల మంది దాదాపుగా కోలుకున్నారు. తాజా లెక్కల ప్రకారం 60 వేల మందికిపైగా మృతి చెందారు. స్పెయిర్‌లో 809, ఇటలీలో 766 మంది చనిపోయారు. అయితే ఈ రెండు దేశాల్లోనూ కొత్తగా కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య నాలుగు శాతంగా నమోదైంది.

Next Story