కొత్త ట్విస్ట్.. అమీన్‌పూర్ బాలికపై అత్యాచారం జరగలేదు
By సుభాష్ Published on 24 Jan 2020 9:59 AM ISTసంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ బాలికపై అత్యాచారం కేసు మరో కొత్త మలుపు తిరిగింది. అసలు బాలికపై అత్యాచారం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం అమ్మాయిపై అత్యాచారం జరిగిందన్న సమాచారంలో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బాలికను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరగలేదని తేలిందని పోలీసులు వివరించారు. కాగా, పోలీసుల విచారణలోనూ తనపై అత్యాచారం జరగలేదని బాలిక తెలిపిందని పోలీసులు పేర్కొన్నారు. ఇక కేసు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
కాగా, మైనర్ బాలిక (16) ముగ్గురు యువకులు కారులో కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. స్థానిక కిరాణ దుకాణంలోంచి సరుకులను తీసుకురావడానికి వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు బాలికను అపహారించి కారులో తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బాధితురాలి తండ్రిది శ్రీకాకుళం జిల్లాగా తెలుస్తోంది. అమీన్‌పూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్ గా డ్యూటీ చేసుకుంటూ స్థానికంగా నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. దిశ ఘటన తరహాలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.