అగ్రరాజ్యం పెద్దన్నను వణికిస్తున్న కరోనా వైరస్‌

By సుభాష్  Published on  27 March 2020 9:58 AM GMT
అగ్రరాజ్యం పెద్దన్నను వణికిస్తున్న కరోనా వైరస్‌

ముఖ్యాంశాలు

  • అమెరికాను వణికిస్తున్న కరోనా వైరస్‌

  • కరోనా కేసుల్లో చైనాను దాటేసిన అగ్రరాజ్యం

  • ట్రంప్‌ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా

  • కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న అమెరికా

  • అనేక రాష్ట్రాల్లో విస్తరించిన మహమ్మారి

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనా దేశాన్ని కుదిపేసిన వైరస్‌.. తర్వాత ఇటలీలో మరణ మృదంగం కొనసాగుతోంది. ఇక అగ్రరాజ్యమైన అమెరికాను సైతం గడగడలాడిస్తోంది. కరోనా వైరస్‌ అమెరికా పెద్దన్నకు చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ల సంఖ్య 85వేలకు పైగా దాటేసింది. చైనా నుంచి వచ్చిన వారితోనే కరోనా వ్యాపించిందని పెద్దన్న రాజ్యం గుర్తించింది. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరోనా మహమ్మారి తన ఓటమికి కారణమవుతుందేమోనని అధ్యక్షుడు ట్రంపే వ్యాఖ్యానించారంటే ఏ మేరకు కరోనా భయపెడుతుందో అర్థమవుతోంది. కరోనా అమెరికాను ఏం చేయదన్న ధీమాలో ఉన్న ట్రంప్‌ ఇలాఖాలో చాపకింద నీరులా వ్యాపించింది. అక్కడ కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది.

కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న పెద్దన్న రాజ్యం

ఒక విధంగా చెప్పాలంటే అగ్రరాజ్యానికి ఇది పెద్ద దెబ్బేనని చెప్పాలి. కరోనా కారణంగా ఆర్థికంగా భారీ మొత్తంలో వ్యవస్థ కుదేలైపోయింది. వ్యాపారాలన్నీ షట్‌ డౌన్‌ అయ్యాయి. అగ్రరాజ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలూ డౌన్‌లోకి వెళ్లిపోయాయి. అభివృద్ధి చెందిన దేశంగా పేరొందిన అమెరికా... ఇప్పుడు కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. ముఖ్యంగా చైనాలోని వూహాన్‌ నగరం నుంచి అధిక మంది డిసెంబర్‌లోనే అమెరికాకు వచ్చారు. ఈ దేశం నుంచి వీకెండ్‌లో విదేశాలకు వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువ కావడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో అమెరికాను కరోనా వైరస్‌ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అగ్రరాజ్యాన్ని దడదడలాడిస్తోంది. మీరు నన్ను ఏం చేయలేరన్న రీతిలో కరోనా ట్రంప్‌ను గజగజవణికిస్తోంది.

అనేక రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి

ప్రస్తుతం అమెరికాలో న్యూయార్క్‌, వాషింగ్టన్‌, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, లోవా, లూసినాయానా, ప్లోరిడా, ఉత్తర కరోలినా, టెక్సాస్‌ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపించింది. ఎటుకదల్లేకుండా మృత్యువును వెంటాడుతోంది. దాదాపు పది కోట్ల మంది ప్రజలు ఈ మహమ్మారి భయంతో లాక్‌డౌన్‌లో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. మరో మూడు నెలలు కఠిన సమయం అని ట్రంప్‌ చెబుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వల్ల భయం గుప్పిట్లో గడుపుతోంది.

కాగా, ట్రంప్‌ ఇప్పటికే రెండు లక్షల కోట్ల డాలరర్లు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అన్నివర్గాల వారికీ ప్యాకేజీని అమెరికా సర్కార్‌ ప్రకటించింది. 75 వేల డాలర్ల లోపు ఆదాయం ఉన్న వారందరికీ 1200 డాలర్లు ప్రభుత్వం వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. కరోనా వైరస్‌ చైనాలో విజృంభించిన సమయంలో ముందస్తుగా అమెరికాలో షట్‌డౌన్‌ చేసి ఉంటే ఇలాంటి ఘోరమైన పరిస్థితి వచ్చేది కాదని బిల్‌ గేట్స్‌ వంటి వారు కూడా తప్పుబడుతున్నారు. చివరకు కరోనా వైరస్‌ పరీక్ష కిట్లు దక్షిణా కొరియా నుంచి తెప్పించుకునే స్థితికి అగ్రరాజ్యం చేరుకుంది. ఏదిఏమైనా అగ్రరాజ్యాన్ని కరోనా వైరస్‌ ముప్పుతిప్పలు పడుతోంది.

Next Story