చంద్రబాబు నిప్పు కాదు..తుప్పు : అంబటి రాంబాబు
By రాణి Published on 14 Feb 2020 6:50 PM ISTవైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్ లపై విమర్శలు గుప్పించారు. ఐటి దాడులలో ప్రాధమిక సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి చంద్రబాబు,లోకేష్ లను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై దాడులు చేస్తేనే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయంటే..ఇక బాబు, లోకేష్ లను విచారణ చేస్తే ఎన్ని లక్షల కోట్లు బయటికొస్తాయోనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సన్నిహితులపై ఐటీ దాడుల్లో కీలక ఆధారాలు లభించినా చంద్రబాబు స్పందించకపోవడంపై అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఐటీ, ఈడీ శాఖలు రాష్ర్టంలోకి రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ఐటీ అధికారులు చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద కీలక ఆధారాలను సేకరించారని, ఇక వారి పాపం పడిందంటూ విమర్శలు చేశారు. ఐటీ దాడులకు భయపడి హైదరాబాద్ లో ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే చంద్రబాబు అక్కడికి వెళ్లారని, తండ్రి - కొడుకు అక్కడే తలదాచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఐటీ దాడులతో చంద్రబాబు బాగోతం బయటపడింది కాబట్టే..ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయారని, కనీసం దాడులపై నోరు మెదపడం లేదని విమర్శలు చేశారు. చంద్రబాబు దోపిడీలకు పాల్పడ్డారని తాము మొదట్నుంచీ చెబుతున్నా పట్టించుకోలేదన్నారు. ఇన్ని రోజులూ చంద్రబాబు కోర్టులను, వ్యవస్థలను మేనేజ్ చేశారన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు గతంలో ఘీంకారాలు పలికారన్నారు. చంద్రబాబుకు సంబంధించిన వారిపై దాడులు జరిగితే ఎల్లో మీడియా వార్తలు రాయడం లేదని అంబటి విమర్శించారు. అలాగే లోకేష్ కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్ పై కూడా ఐటీ దాడులు జరిగాయన్నారు.
చంద్రబాబు నిప్పు కాదు తుప్పు..బాబు, లోకేష్ బినామీలందరిపై ఐటీ దాడులు జరిగినా పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపట్లేదు ? ప్రతిరోజు నీతి వాక్యాలు చెప్పే సీపీఐ రామకృష్ణ ఏమయ్యారని ప్రశ్నించారు. ప్యాకేజీలు తీసుకుని రాజకీయాలు చేసే వీరు ప్రజలను ఉద్ధరిస్తారా అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీగ లాగితే డొంక కదులుతుందని..త్వరలోనే అందరి అవినీతి ఐటీ అధికారులు బయటపెడతారని అంబటి హెచ్చరించారు.