ముఖేష్ అంబానీ.. ప్రపంచ కుబేరుల స్థానంలో ఐదో స్థానానికి..!

By సుభాష్  Published on  24 July 2020 10:50 AM IST
ముఖేష్ అంబానీ.. ప్రపంచ కుబేరుల స్థానంలో ఐదో స్థానానికి..!

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో అయిదో స్థానానికి ఎగబాకారు. ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్‌లో ఆసియా నుంచి ఉన్న ఏకైక వ్యక్తిగా ముఖేష్ అంబానీ నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం 75.1 బిలియన్ డాలర్ల నికర విలువతో ముఖేష్ అంబానీ 5వ స్థానానికి చేరుకున్నారు. బర్క్‌షైర్ హాత్‌వే సీఈఓ వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టేసిన ముఖేష్ అంబానీ.. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ కు అతి దగ్గరగా నిలిచారు. మార్క్ జుకర్ బర్గ్ 88.1 బిలియన్ డాలర్ల నికర విలువతో 4వ స్థానంలో ఉన్నారు. గూగుల్, ఫేస్‌బుక్, క్వాల్కమ్, ఇంటెల్ లాంటి దిగ్గజ సంస్థలు జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాలు పొందేందుకు ఇన్వెస్ట్‌మెంట్ డీల్స్ కుదుర్చుకోవడంతో రిలయన్స్ సంస్థ షేర్లు కూడా భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో ముఖేష్ అంబానీ కూడా ప్రపంచ కుబేరుల లిస్టులో పైపైకి ఎదుగుతూ ఉన్నారు.

అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ 183.7 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో మైక్రో సాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, మూడో స్థానంలో LVMH మోయిట్ హెన్నెస్సీ ఛైర్మన్ బెర్నార్డ్ అర్నాల్ట్ ఫ్యామిలీ ఉంది. నాలుగో స్థానంలో మార్క్ జుకర్ బర్గ్, ఐదో స్థానంలో ముఖేష్ అంబానీ, ఆరో స్థానంలో వారెన్ బఫెట్, ఏడో స్థానంలో ఒరాకిల్ కార్పొరేషన్ ఫౌండర్ లార్రీ ఎల్లిసన్, ఎనిమిదో స్థానంలో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మర్, తొమ్మిదో స్థానంలో టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, పదో స్థానంలో గూగుల్ కో-ఫౌండర్ లారీ పేజ్ ఉన్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ప్రపంచంలోని అత్యంత విలువైన 50 కంపెనీల్లో చోటు దక్కించుకుంది. రూ.13 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన తొలి కంపెనీగా అవతరించిన రిలయన్స్ స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం గ్లోబల్ మార్కెట్ క్యాప్‌లో 48వ ర్యాంకు సొంతం చేసుకుంది. సౌదీ ఆరామ్కో ప్రపంచంలో అతి పెద్ద ‘మార్కెట్ క్యాప్’ ఉన్న సంస్థగా కొనసాగుతోంది. ఆ సంస్థ మార్కెట్ క్యాప్ 1.7 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. ఆ తర్వాత స్థానాల్లో ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్ ఉన్నాయి.

Next Story