భగ్గుమన్న 'భూమాత' ఊపిరితిత్తులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2019 4:34 PM GMT
భగ్గుమన్న భూమాత ఊపిరితిత్తులు..!

ప్రకృతి ఊపిరితిత్తులు భగ్గున మండిపోయాయి. రోజుల తరబడి అగ్ని జ్వాలలు చెలరేగాయి. ప్రాణదాతలే చితిమంటల్లో మండిపోతుంటే యావత్ ప్రపంచం తల్లడిల్లిపోయింది. కాపాడుకుందా రండి అంటూ అంతర్జాతీయ సమాజం ఒక్కటై ముందుకు కదిలింది. ఇంత జరిగినా, అసలు దేశం మాత్రం నిమ్మకు నీరెత్తిన ట్లు ఉండిపోయింది. పైగా, మా ఇష్టం అంటూ ఎదురుదాడి చేసింది. ఆ దేశం తీరును చూసిన ప్రపంచ దేశాలు మూకుమ్మడిగా కస్సుమన్నాయి. దాంతో ఆ దేశం వెనక్క తగ్గింది. యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసిన అమేజాన్ అడవుల సంగతి ఇది.

అమేజాన్ ఒక సుందరవనం

వాస్తవానికి అమెజాన్‌ ఒక సుందరవనం. 55 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అరణ్యమది. దాదాపు 135 కోట్ల ఎకరాల్లో, 9 దేశాల పరిధిలో అమేజాన్ అడవులు విస్తరించాయి. అందులోనూ 60 శాతం అడవి బ్రెజిల్‌లోనే ఉంది. మిగిలిన అరణ్యం పెరూ, కొలంబియా, వెనెజులా, ఈక్వెడార్‌, బొలీవియా, గయా నా, సరినామ్‌, ఫ్రెంచ్‌ గయానా తదితర 8 దేశాల్లో విస్తరించింది. ప్రపంచానికి కావాల్సిన ఆక్సిజన్‌లో 20 శాతం అమేజాన్ అడవులే అందిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. యావత్ ప్రపంచం వదులుతున్న కార్బన్‌లో పాతిక శాతాన్ని ఈ అడవులే పీల్చుకుంటున్నాయట. అందుకే అమేజాన్ అడవులను ప్రపంచపు ఊపిరితిత్తులుగా అభివర్ణిస్తారు.

సుందరవనంలో రేగిన చిచ్చు

ప్రపంచానికి ఊపిరితిత్తులుగా పేరొందిన అమేజాన్ అడవుల్లో చిచ్చు రాజుకుంది. ఆగస్టు 10న రేగిన చిచ్చు అంతకంతకూ పెరిగి దావాలనంలా మారింది. అగ్ని జ్వాలల్లో చిక్కి వేలాది హెక్టార్ల అడవి కాలిబూడిదైంది. కార్చిచ్చు కారణంగా వెలువడిన పొగ అంతరిక్షం నుంచి కూడా కనిపించడం గమనార్హం. ఈ పొగ దాదాపు 3, 500 కిలో మీటర్ల మేర ప్రయాణించిందని సమాచారం. అడవికి 3 వేల 200 కి.మీ. దూరంలో ఉన్న బ్రెజిల్‌లోని సావోపోలో నగరంపై నల్లని పొగ కమ్ముకుంది.

ఆగస్టు 19, 20వ తేదీల నాటికి ఓ మోస్తరుగా మంటలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మంటల తీవ్రత పెరిగింది. సావోపాలో నగరమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. బ్రెజిల్‌లోని 9 రాష్ట్రాల్లో అమెజాన్‌ అడవులు వ్యాపించి ఉండగా 7 రాష్ట్రాల పరిధిలోని అడవికి నిప్పంటుకుంది. కేవలం 3 వారాల్లో లక్షా 83 వేల ఎకరాల అడవి భస్మీపటలమైంది. చెట్లు మాడిపోయాయి. వన్యప్రాణులు సజీవ దహనమయ్యాయి. ఆదివాసీలు ప్రాణాల కోసం పరుగులు పెట్టారు. దావాలనం ధాటికి 57 శాతం అడవి అంతరించిపోయినట్లు బ్రెజిల్‌ జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం గుర్తించింది. సుమారు 4 వేల 5 వందల 71 చదరపు కిలోమీటర్ల మేర అటవి పూర్తిగా కాలిపోయిందని సమాచారం.

ఊపిరితిత్తుల్లో కార్చిచ్చులు

అమేజాన్ అడవులు వర్షాధారం. జూలై నుంచి అక్టోబర్ వరకు పొడికాలం కొనసాగుతుంది. ఈ సమయంలో మంటలు చెలరేగడం సహజమే. మిగతా కాలంలో వర్షాలు పడినప్పుడు అడవి ఆ నష్టాన్ని పూడ్చుకుంటుంది. ఐతే రానురాను మానవ వికృత చర్యలు అమేజాన్‌కు శాపంగా పరిణమించాయి. అడవుల నరికివేత, పొలాల కోసం చెట్లను దహనం చేయడం, పశువుల మేత కోసం అడవులను శుభ్రం చేయడం వంటి చర్యలతో కార్చిచ్చులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్రెజిల్‌లో దావాలనాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2019లో ఇప్పటివరకు బ్రెజిల్‌లో 78 వేల 383 కార్చిచ్చులు నమోదయ్యాయి. గత ఆరేళ్లలో ఇదే అత్యధికం. 2018తో పోల్చితే ఇది 88 శాతం ఎక్కువ. అంతేకాదు.. 2016 నుంచి ఇప్పటివరకు నమోదైన సగటు కార్చిచ్చులతో పోల్చితే 60 శాతం అధికం. 2018లో మొదటి 8 నెలల్లో 39 వేల 759 సార్లు మంటలు చెలరేగాయి. ఇక అమేజాన్ బేసిన్‌లోని మిగతా దేశాల్లోనూ వేల సంఖ్యలో కార్చిచ్చు ఘటనలు నమోదవుతున్నాయి. వెనిజులాలో 26వేలు, బొలీవియాలో 17వేలకు పైగా మంటలు చెలరేగి అడవిని హననం చేస్తున్నాయి.

గ్లోబల్ వార్మింగ్‌ మృత్యు గంటలు

మానవుల వికృత చర్యలతో ఇప్పటికే ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ ముప్పును ఎదుర్కొంటోంది. ఆ ముప్పును అడ్డుకోవడంలో అమేజాన్‌ది కీలకపాత్ర. ఏటా కోట్ల టన్నుల మేర కర్బన ఉద్గారాలను అమేజాన్ పీల్చుకుంటోంది. కానీ, ఇప్పుడు ఆ అడవే తగలబడిపోవడంతో కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు విడుదలయ్యాయి. సాధారణంగా చెట్లను కాల్చినప్పుడు అవి గతంలో శోషించుకొని నిల్వ చేసుకున్న కర్బన ఉద్గారాలు బయటికి వస్తాయి. అమెజాన్ విషయంలోనూ అదే జరుగు తోంది. 2019లో ఇప్పటివరకు అమెజాన్ మహారణ్యంలో చెలరేగిన కార్చిచ్చుల వల్ల 230 మెగాటన్నుల కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలయ్యాయని అంచనా. అంటే.. 2,300 కోట్ల కిలోల ఉద్గారాలు వాతావరణంలోకి కలిసిపోయాయి. ఇది ఆస్ట్రేలియా, పోలాండ్, టర్కీ తదితర దేశాలు ఏడాది కాలంలో విడుదల చేసే ఉద్గారాలకు సమానం. ఇలాగే కొనసాగితే వచ్చే 30-50 ఏళ్లలోనే భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రకృతి సమతౌల్యానికి పెనుముప్పు

అమెజాన్ మహారణ్యంలో 30 లక్షలకు పైగా జీవజాతులు నివసిస్తున్నాయి. అత్యంత అరుదైన వృక్ష, జంతు జాతులకు ఇది ఆలవాలం. అంతేకాదు.. అత్యంత అరుదైన తెగలకు చెందిన మూలవాసులు దాదాపు 10 లక్షల మంది ఈ అడవిలోనే బతుకుతున్నారు. మూడు కోట్ల మందికిపైగా అడవిపై ఆధారపడుతున్నారు. సుమారు 5 వందల అమెరికన్‌ సంచార గిరిజన తెగలతోపాటు, 2 వేల రకాల జీవజాతులకు అమెజాన్‌ స్వర్గధామం. కార్చిచ్చుల వల్ల అరుదైన జీవజాతులు అంతరించిపోయే ప్రమాదమేర్పడింది. జీవావరణానికి విఘాతం కలగడంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది.

అసలు దోషి బ్రెజిల్

అమేజాన్ అడవులు నాశనం కావడంలో బ్రెజిలే ప్రధాన దోషి. 1970ల్లో అమెజాన్ విస్తీర్ణం దాదాపు 150 కోట్ల ఎకరాలు. ఐతే, ఐదు దశాబ్దాల్లోనే బ్రెజిల్ 12-15 శాతం అడవులను కొట్టివేసింది. ఈ నరికివేత 20-25 శాతానికి చేరితే ప్రపంచానికే పెనుముప్పు అని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. ఐనప్పటికీ బ్రెజిల్ ప్రభు త్వం పట్టించుకోవడం లేదు. గతంలో పటిష్ఠంగా ఉన్న అటవీ పరిరక్షణ చట్టాలను ప్రభుత్వాలు బలహీనం చేస్తూ వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బొల్సోనారో ఓ అడుగు ముందుకు వేసి విచ్చలవిడి నరికివేతకు ద్వారాలు తెరిచారు. దేశ ఆదాయాన్ని పెంచేందుకు చట్టాలను మరింత నిర్వీర్యం చేశారు. ఫలితంగా వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులకు నిప్పు పెడుతూ ధ్వంసం చేస్తున్నారు. దీనికి తోడు గనుల తవ్వకం, కలప అక్రమ రవాణా, వ్యవసాయం వంటివి పెరిగిపోయాయి. కొన్నిచోట్ల ఆగస్టు 10వ తేదీని ఫైర్ డే గా పాటిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో తీరు అత్యంత దారుణం. ఆయనది వితండ వాదం. ప్రపంచానికి మేం ఆక్సీజన్ ఇస్తున్నాం... మరి మాకేమిస్తారు అంటూ సిగ్గు ఎగ్గూ లేకుండా అడిగే మనస్తత్వం ఆయనది. గ్లోబల్‌ వార్మింగ్‌ అనేది ఉత్త ట్రాష్‌ అని చెబుతారు. పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలపై నోరు పారేసుకున్నారు కూడా. పైగా, మా అడవులు తగలబడి పోతుంటే మీకేం ఇబ్బంది అంటూ ఎదురుదాడి చేశారు. మా అడవుల విషయంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దని, విదేశాల సాయం తీసుకుంటే అది తమకు అవమానమని వింత భాష్యం చెప్పారు.

ఇక, బ్రెజిల్‌ అటవీశాఖ మంత్రి ఎర్నెస్టో అరౌసో మరింత ఘనుడు. అడవుల క్షీణత జూలైలో 278 శాతం పెరిగిందని ఉపగ్రహ చిత్రాలతో నిరూపించిన బ్రెజిల్‌ ఉపగ్రహ కేంద్ర అధిపతిపై వేటేశారు. మొత్తంగా, అమేజాన్ అడవులు భయంక రంగా కాలిపోవడానికి బోల్సోనారో పాపాలే కారణం. సరైన సమయంలో ప్రపంచ దేశాల సాయం తీసుకోకుండా అడవి కాలిపోయే వరకు అలాగే ఉండిపోయారు.

పర్యావరణ ప్రమాణాల ప్రకారం... ఒక దేశ విస్తీర్ణంలో కనీసం 33 శాతం పచ్చదనం ఉండాలి. బ్రెజిల్‌ విషయానికి వస్తే ఆదేశ విస్తీర్ణంలో 60 శాతం అడవులే ఉన్నాయి. అంటే... బ్రెజిల్‌లో ఉండాల్సిన దానికంటే చాలానే అడవి ఉందన్నమాట. మరోవైపు... వ్యవసాయానికి అవసరమైన భూమికి చాలా కొరత ఉంది. ఈ నేపథ్యంలో అమేజాన్‌ను ‘ఖాళీ’ చేయడం తమకు అవసరమని బోల్స్‌నారో వాదిస్తారు. అమేజాన్‌ అడవులను కొట్టేస్తూ, కాల్చేస్తూ... కొద్దికొద్దిగా ఖాళీ చేయడం తరచూ జరిగేదే. 2012 నుంచి అది శ్రుతి మించింది. అడ్డగోలుగా గనుల తవ్వకానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అడవికి నిప్పు పెట్టారు. కార్చిచ్చును ఆర్పాల్సిన యంత్రాంగం కామ్‌గా కూర్చుంది.

వాస్తవానికి బ్రెజిల్‌ ఒక శాంతియుత, సరదా దేశం. దక్షిణ అమెరికాలోని పది దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్నా ఎవ్వరితోనూ గొడవల్లేవు. అమేజాన్‌ అడవి ఉన్న దేశంగా బ్రెజిల్‌ అంటే ప్రపంచ పర్యావరణ వేత్తలందరికీ ఎంతో అభిమానం. ఇప్పుడు అదే అమేజాన్‌ను బ్రెజిల్‌ సర్కారు తగలబెడుతుండటాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అమేజాన్‌ను కాపాడుకోవడానికి ప్రపంచదేశాలన్ని ముందుకు వచ్చాయి. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో అభ్యంతరాలను పట్టించు కోకుండా సమష్టిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. బ్రెజిల్ సార్వభౌమ దేశమే కావొచ్చు, కానీ అమేజాన్ ప్రపంచస్థాయి అంశం అన్నది పర్యావరణవేత్తల వాదన.

- రంజన్, సీనియర్ జర్నలిస్ట్

Next Story